మైదానంలో కావాల్సింది ఫిట్‌నెస్‌..

మైదానంలో కావాల్సింది ఫిట్‌నెస్‌..

మైదానంలో అడుగుపెట్టే ప్రతి ఆటగాడికి కావాల్సింది ఫిట్‌నెస్ అని టీమిండియా బ్యాట్స్ మెన్ అంబటి తిరుపతి రాయుడు అన్నారు. ప్రతి ఐపీఎల్ లో రాణించే అంబటి రాయుడు.. ఈ ఐపీఎల్-11 లో అద్భుతంగా రాణించి చెన్నై జట్టు తరుపున పరుగుల వరద పారించాడు. ఈ సీజన్ లో చెన్నై తరుపున 16 మ్యాచ్‌లు ఆడి 602 పరుగులతో.. చెన్నై తరఫున అత్యధిక పరుగుల సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ గణాంకాలు పరిశీలిస్తే చెన్నై జట్టు కప్పు గెలవడంలో రాయుడి పాత్ర ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. రాయుడి ఐపీఎల్‌ ట్రోఫీ అందుకోవడం ఇది నాలుగో సారి. మూడు సార్లు ముంబై తరుపున.. ఒకసారి చెన్నై జట్టు తరఫున కప్పును ముద్దాడాడు.

నాలుగుసార్లు ఛాంపియన్‌ జట్టులో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని రాయుడు తెలిపాడు. రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లో మళ్లీ అడుగుపెట్టిన చెన్నై విజేతగా నిలవడం చాలా గొప్ప విషయం. ఫైనల్ మ్యాచ్ లో విన్నింగ్ షాట్‌ కొట్టడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. చెన్నై జట్టులో కుటుంబ వాతావరణం ఉంటుంది.. ఆటగాళ్లను జట్టు యాజమాన్యం బాగా చూసుకుంటుంది. చెన్నై జట్టు అభిమానులు మాకు మద్దతుగా ఉన్నారన్నారు రాయుడు. ఫైనల్ మ్యాచ్ వికెట్‌ చాలా బాగుంది. మ్యాచ్ మొదటిలో సన్‌రైజర్స్‌ బౌలర్లు ఇబ్బంది పెట్టారు.. టాప్ బౌలర్ భువి, రషీద్ లు మమ్మల్ని కట్టడి చేశారు. చెన్నై జట్టులో మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉండటంతో.. క్రీజులో కుదురుకుంటే పరుగులు వస్తాయని అనుకున్నాం. నేను మైదానంలోకి వచ్చేసరికే షేన్‌ వాట్సన్‌ పనంతా పూర్తిచేశాడు, నాపై ఒత్తిడేమి లేకపోవడంతో సులువుగా ఆడాను అని రాయుడు తెలిపాడు. ఫైనల్లో రషీద్‌ఖాన్‌ను ఎదుర్కోడానికి ప్రణాళికలు రచించాం.. వాటిని చక్కగా అమలుచేశాం కాబట్టే అతనికి ఫైనల్ మ్యాచ్ లో ఎవరు చిక్కలేదని రాయుడు పేర్కొన్నాడు.

ఫిట్‌నెస్‌ విషయంలో కెప్టెన్ ధోని అన్నది నిజం. జట్టులో చాలామంది కుర్రాళ్లున్నా.. ఫిట్‌గా ఉండరు. మైదానంలో అడుగుపెట్టిన ప్రతి ఆటగాడికి కావాల్సింది ఫిట్‌నెస్‌. ఆట నైపుణ్యం, అనుభవం, ఫిట్‌నెస్‌ ఉన్న ఆటగాడు కచ్చితంగా రాణిస్తాడని రాయుడు అన్నారు. ఏ ఆటలో అయినా సరే ఫిట్‌నెస్‌ అత్యంత కీలకమని రాయుడు అభిప్రాయపడ్డాడు. నేను టాప్‌ఆర్డర్‌లో ఆడితే బాగా పరుగులు చేయగలని ధోని ఎప్పట్నుంచో అనేవాడు. చెన్నై జట్టు తరఫున ధోనీనే నన్ను ఓపెనర్‌గా పంపాడని తెలిపాడు. టీమ్‌ఇండియాలో మళ్లీ చోటు దక్కడం చాల సంతోషం అని రాయుడు అన్నారు. 

Photo: FileShot