రాజ్యసభకు కపిల్‌ దేవ్‌?

రాజ్యసభకు కపిల్‌ దేవ్‌?

భారత క్రికెట్‌ జట్టుకు వరల్డ్ కప్ అందించిన మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ త్వరలోనే పార్లమెంట్‌లో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కపిల్‌ దేవ్‌తో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు 2014 సాధారణ ఎన్నికలలో కపిల్ దేవ్‌‌ను లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా కొన్ని పార్టీలు సంప్రదించగా.. వారి ఆహ్వానంను తిరస్కరించారు. ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను  విజయవంతంగా పూర్తిచేసిన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా 'సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌' పేరుతో దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు.

ఈ పర్యటనలో భాగంగా అమిత్‌ షా దిల్లీలో కపిల్‌దేవ్‌ ఇంటికి వెళ్లారు. కపిల్‌దేవ్‌, అతని భార్యను అమిత్‌ షా కలిశారు. ఈ భేటీలోనే కపిల్‌దేవ్‌తో రాజ్యసభకు నామినేట్ అంశంపై చర్చలు జరిపినట్టు  సమాచారం. అయితే దీనిపై అటు మిత్‌ షా కానీ.. ఇటు కపిల్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం రాజ్యసభ నామినేట్‌డ్‌ సీట్లలో 7 స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో క్రీడారంగం నుంచి కపిల్‌దేవ్‌ను నామినేట్‌డ్‌ చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది.