భారత ఆర్థికవ్యవస్థ కూలే ప్రమాదం ఉంది

భారత ఆర్థికవ్యవస్థ కూలే ప్రమాదం ఉంది

అర్జెంటీనా ఆర్ధికవ్యవస్థ లాగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా కూలే ప్రమాదం ఉంది అని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ... డిమానిటైజేషన్ చేసి నేటికీ రెండేళ్లు. నోట్ల రద్దు విఫలము అయింది.. పైగా స్కాం కూడా జరిగిందన్నారు. పెద్ద నోట్ల రద్దు విషయం కొందరు బీజేపీ నేతలకు ముందే తెలిసి నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారన్నారు. అమిత్ షాకు చెందిన కో ఆపరేటివ్ బ్యాంక్ ద్వారా డబ్బులు పెద్ద మొత్తంలో మారాయి. నోట్ల రద్దు వ్యవహారంలో ఎలాంటి కుంభకోణం లేకపోతే జేపీసీ ఎందుకు వేయలేదని  ప్రశ్నించారు. మార్కెట్లో 2 వేల రూపాయల నోట్లు మాయమైపోయాయి. నల్లధనం ఇపుడు ఎక్కువ అయిపోయిందన్నారు. ఇప్పటికి పాత 1000, 500 ల నోట్లు మారుస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక నోట్లు రద్దు అత్యంత పెద్ద కుంభకోణంగా కుటుంబరావు అభివర్ణించారు. పెద్ద నోట్ల వినియోగం తగ్గించటానికే నోట్లు రద్దు చేశామని కేంద్రం చెప్పింది కానీ.. రెండు వేల నోట్లు వినియోగం మాత్రం బాగా పెరిగిందని ఆయన తెలిపారు.

నోట్ల రద్దు స్కామ్‌పై 2019 తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే వాళ్లు దర్యాప్తు చేయాలని కుటుంబరావు కోరారు. క్యాపిట వర్డ్ కంపెనీ ద్వారా ఎంఎస్ఎంఈ రుణాలు 59 నిమిషాల్లో ఇస్తారట.. క్యాపిట వర్డ్ కు ఎలా అప్పజెప్పారని అడిగారు. స్కామ్ లను ఆర్ధిక ఉగ్రవాదులు మాత్రమే చేయగలరు.. కేంద్ర ఆర్థికమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ మోసాలపై.. 100 కేసులపై ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా ఆడుకోవచ్చు అనేదానికి కేంద్ర ప్రభుత్వమే ఉదాహరణ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని నిర్వీర్యం చేస్తూ వస్తోంది.. అర్జెంటీనా ఆర్ధికవ్యవస్థ లాగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా కూలే ప్రమాదం ఉందన్నారు. ఆర్బీఐ బోర్డ్ మీటింగ్ త్వరలో జరగనుంది.. ఆ రోజు ఆర్బీఐ గవర్నర్ రాజీనామా  చేసే అవకాశం లేకపోలేదన్నారు. దేశ స్థాయిలో ఆర్థిక ఉగ్రవాదులంటే మోదీ, అమిత్ షాలని తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి అంశాలను కూడా బీజేపీ తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని  కుటుంబరావు ధ్వజమెత్తారు.