రెండు ఇన్నింగ్స్‌లు.. రెండు డబుల్‌ సెంచరీలు

రెండు ఇన్నింగ్స్‌లు.. రెండు డబుల్‌ సెంచరీలు

ఒక ఆటగాడు.. ఒకే మ్యాచ్‌.. రెండు ఇన్నింగ్స్‌లు.. రెండు డబుల్‌ సెంచరీలు. శ్రీలంక ఆటగాడు ఏంజెలో కనిష్క పెరీరా ఈ రికార్డు సాధించాడు. దీంతో ఫస్ట్‌ క్లాస్‌ చరిత్రలో ఒక మ్యాచ్‌లోని రెండు  ఇన్నింగ్స్‌లలోనూ రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన రెండవ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. శ్రీలంక దేశవాళీ టోర్నీలో భాగంగా సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్, ఎన్‌సీసీ జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్‌ జరిగింది. ఎన్‌సీసీ జట్టుకు కెప్టెన్‌ అయిన ఏంజెలో పెరీరా తొలి ఇన్నింగ్స్‌లో 201 (203 బంతుల్లో) పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 231 (268 బంతుల్లో) పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులు చేయడంతో ఎన్‌సీసీ జట్టు 579 పరుగులు చేసింది. అయితే చివరకు ఈ మ్యాచ్ డ్రా అయింది.

ఏంజెలో కనిష్క పెరీరా ఈ ఫీట్ సాధించడంతో దాదాపు 81 ఏళ్ల క్రితం నాటి రికార్డు సమం అయింది. పెరీరా కంటే ముందు 1938లో కెంట్‌ బ్యాట్స్‌మన్‌ ఆర్థర్‌ ఫాగ్‌ (244, 202 నాటౌట్‌) కూడా రెండు  ఇన్నింగ్స్‌లలోనూ రెండు డబుల్‌ సెంచరీలు చేశాడు. పెరీరా శ్రీలంక జట్టు తరఫున 4 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. పెరీరా మొత్తం 97 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో 6,941 పరుగులు చేసాడు. ఇందులో 18 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.