కుంబ్లే చెప్పినట్లే జరిగింది...

కుంబ్లే చెప్పినట్లే జరిగింది...

ఆస్ట్రేలియాలో తొలిసారి భారత్‌ 2-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ గెలిచి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న టెస్ట్ సిరీస్ కలను నెరవేర్చింది. భారత్‌ టెస్ట్ సిరీస్ గెలిచి మాజీల అంచనాలను తలక్రిందులు చేసింది కానీ ఒకరి అంచనాలను మాత్రం నిజం చేసింది. టెస్ట్ సిరీస్ మొదలయ్యే ముందు మెక్‌గ్రాత్, పాంటింగ్‌ లాంటి హేమాహేమీలు ఆసీస్ 4-0తో సిరీస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాత్రం సిరీస్ భారత్ దే అని చెప్పారు. అంతేకాదు ఓ మ్యాచ్ డ్రా అవుతుందని కూడా అంచనా వేసారు.

సిరీస్ మొదలయ్యే ముందు క్రికెట్ నెక్ట్స్ వెబ్‌సైట్‌కు కుంబ్లే ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో భాగంగా ఓ జర్నలిస్ట్ సిరీస్ ఎవరు గెలుస్తారని అడగ్గా.. భారత్ కచ్చితంగా 2-1తో గెలుస్తుందని సమాధానం చెప్పాడు. ఓ మ్యాచ్ డ్రా అవుతుందని అనుకుంటున్నారా అని జర్నలిస్ట్ ప్రశ్నించగా.. వర్షాలు భారీగా పడే అవకాశం ఉంది కాబట్టి ఓ మ్యాచ్ డ్రా కావచ్చు అని కుంబ్లే బదులిచ్చాడు. కుంబ్లే చెప్పినట్లుగానే ఇండియా 2-1తో గెలిచింది. అంతేకాదు సిడ్నీ టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయింది. దీంతో అభిమానులు కుంబ్లేపై ప్రసంశలు కురిపిస్తున్నారు. కుంబ్లే ఓ ఆక్టోపస్ అంటూ ట్వీట్లు  చేస్తున్నారు. మరొకరు అద్భుత క్రికెట్ బ్రెయిన్ ట్వీట్ చేశారు.