ఏపీలో వాహనాలకు ఒకే సిరీస్

ఏపీలో వాహనాలకు ఒకే సిరీస్

ఏపీ రవాణాశాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని వాహనాలకు ఒకే సిరీస్‌ నంబరును అమలు చేయాలని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇలా చేయడం దేశంలోనే మొదటిసారి. 'ఒకే రాష్ట్రం.. ఒకే కోడ్'లో భాగంగా ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఒకే సిరీస్ నంబరును కేటాయించనున్నారు. ఇప్పటివరకూ పోలీసు వాహనాలకు ఉన్న 'పీ' సిరీస్ అలాగే కొనసాగుతుంది. ఆర్టీసీ వాహనాలకు 'ఏపీ 39 జడ్‌'.. ఇతర రవాణా వాహనాలకు టీ, యు, వి, డబ్ల్యూ, ఎక్స్‌, వై అక్షరాలతో ప్రారంభం కానున్నాయి. 'ఓ' అక్షరం సున్నాలా ఉంటుంది కాబట్టి దాన్ని కేటాయించే అవకాశం లేదు.

ఈ విధానంతో కొత్త వాహనాలన్నీ ‘ఏపీ 39’ సిరీస్‌తోనే ప్రారంభమవుతాయి. ఇక నుంచి జిల్లాకో సిరీస్ ఉండదు. దీంతో వాహనాలను ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ  విధానం వల్ల వాహనదారులకు సమయం, సొమ్ము.. రవాణాశాఖకు ఆదాయం పెరనుంది. అయితే ఏపీ 39 సిరీస్‌ ముగిసిన తర్వాత కోడ్‌ను ఏపీ 40కి మారుస్తారు. రాష్ట్రమంతా ఒకటే కోడ్ రావడంతో.. ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే ఆన్‌లైన్‌ ద్వారా బిడ్డింగ్‌కు వెళ్లాల్సిందే.