మోడీకి మించిన నటులు లేరు 

మోడీకి మించిన నటులు లేరు 

మోడీకి మించిన నటుడు ప్రపంచంలో లేరు... మోడీ మాటల మనిషే ... చేతల మనిషి కాదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏపీ భవన్‌ వేదికగా ధర్మపోరాట దీక్ష చేపట్టిన ఆయన.. .వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పుడు మాట మారుస్తారా అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. మన దీక్ష పవిత్రమైన దీక్ష అందుకే అందరి సంఘీభావం తెలియజేశారు. ఆంధ్రులు ఏకాకికారని అని పేర్కొన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు బీజేపీ నేతలే చెప్పారని గుర్తు చేశారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని అడిగారని తెలిపారు. 
ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఏపీకి అన్యాయం చేశారని విమర్శించారు. ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారని తెలిపారు.  పోలవరం డీపీఆర్‌ను ఆమోదించలేదన్నారు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు పరిశ్రమపై అతీగతీ లేదన్నారు. రెవెన్యూ లోటు తీర్చలేదని తెలిపారు. రాజధాని నిర్మాణానికి నిధులు  ఇవ్వలేదన్నారు.  ఐదు కోట్ల ప్రజల కోసం.. భావితరాల భవిష్యత్తు కోసం.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం  కోసం పోరాడుతున్నామని తెలిపారు. ఆంధ్రభవన్‌ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు చేశామనీ.... అవన్నీ కూడా విజయవంతమయ్యాయని వెల్లడించారు.

ఢిల్లీ దీక్షకోసం వస్తే... ప్రజలసొమ్ముతో దీక్ష చేస్తారా అని ప్రశిస్తారు.. మీరు 2011లో చేసిన దీక్ష ఖర్చు రూ. 1.67 కోట్లు ఖర్చయిందని గుర్తు చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే ఇక్కడ దీక్షకు కూర్చున్నామని తెలిపారు.  కేంద్రం అన్యాయం చేసినందుకే పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. కొత్త రాష్ట్రం కాబట్టి కేంద్రం సాయం చేయకపోతుందా అని నాలుగేళ్లు ఎదురుచూశామని, ప్రత్యేకహోదా కన్నా మెరుగైన ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ.. ఏపీకి హోదా ఇవ్వకుండా మరో 11రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చి ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగం చేసిన... అర్జునరావు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అర్జునరావు కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయాన్ని చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఏపీ ఎంతటి మనస్థాపానికి లోనవుతుందో మోడీ గుర్తించాలని పేర్కొన్నారు.