మళ్లీ మేం వస్తేనే అభివృద్ధి...

మళ్లీ మేం వస్తేనే అభివృద్ధి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో మాట్లాడారు. కష్టాల నుంచి రాష్ట్రంలో పరిపాలన ప్రారంభించామని.. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోటీ పడేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించామని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా.. లబ్దిదారులు సంతృప్తితో ఉన్నారా..? లేదా అనే అంశం సమాచారాన్ని తెప్పిస్తున్నామని కూడా తెలిపారు. అలాగే. వచ్చే నెల నుంచి కొత్త ఫించన్ల అమలు చేస్తామని.. అర్హులందరికీ ఫించన్లు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నవ నిర్మాణ దీక్షల సమయంలో కొత్త ఫించన్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ... విద్యా, వైద్య రంగాలకు ఏపీ అధిక ప్రాధాన్యతనిచ్చామని... ప్రాథమిక విద్యా రంగంలో దేశంలో టాప్-3 ప్లేసులో ఉన్నామన్నారు. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని.. ఆర్బీఐ, కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేకున్నా.. రూ. 24 వేల కోట్ల మేర రుణ మాఫీ చేస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని వెల్లడించారు. ఉపాధి హామీని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయమని కేంద్రాన్ని అడిగితే ఇవ్వడం లేదన్నారు. స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను కేంద్రం అమలు చేయడం లేదని..రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇకపై మహిళలు నీళ్లు మోసుకెళ్ళే బాధలు తప్పిస్తామన్నారు. రాయలసీమకు ఏం చేశారనే విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాలని.. అనంతలో కియా మోటార్స్ వచ్చింది.. చిత్తూరులో శ్రీసిటీ వచ్చింది..శ్రీ సిటీకి ధీటుగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ క్లస్టర్ రాబోతోందని అన్నారు. ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. 'రాయలసీమకు 140 టీఎంసీల నీరిచ్చాం. ప్రతిపక్ష నేత పాదయాత్రలో సమస్యలపై ఒక్క ఫిర్యాదైనా వస్తోందా..? నేను పాదయాత్ర చేసినప్పుడు ఎన్నో సమస్యలను ప్రజలు నా దృష్టికి తెచ్చేవారు. ప్రభుత్వంపై ప్రజల్లో 73 శాతం సంతృప్త స్థాయి వచ్చింది. ఈ సంతృప్త స్థాయిని రాజకీయంగా మనకు అనుకూలంగా మలుచుకోవాలి. అధికారం కంటిన్యూటీ ఉంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయగలం. అధికారులందరూ ఒకేలా లేరు.. వాళ్లతో సక్రమంగా పని చేయించాలి. అధికారులకి ఎన్నికలతో పని లేదు.. కానీ మనకు అవసరం. మనం అధికారంలో కంటిన్యూగా ఉండాలనేది మన కోసం కాదు.. అభివృద్ధి కోసం టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఏపీకి చారిత్రక అవసరం' అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కృషి చేయాలని.. అభివృద్ధి మన కష్టంతో సాధింస్తున్నామే తప్ప.. కేంద్ర సహకారంతో కాదని ప్రజలే చెబుతున్నారని వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'సమాజంలో విలువలు పడిపోయేటప్పుడు ఈ తరహా ఘటనలు జరుగుతాయి. సంపద ఎంత ముఖ్యమో.. విలువలూ అంతే ముఖ్యం' అని చంద్రబాబు నాయుడు  అన్నారు.