ప్రపంచమే మన వైపు చూస్తోంది: చంద్రబాబు

ప్రపంచమే మన వైపు చూస్తోంది: చంద్రబాబు

యావత్ ప్రపంచమే మన వైపు చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం చివరిరోజు జన్మభూమిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసాం. మనది బలహీన బృందమని చిన్నచూపు చూశారు. ఆ బృందంతోనే అద్భుతాలు సృష్టించాం. ఏపీఆర్టీజీని టోనీ బ్లెయిర్, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్ అభినందించారు. సింగపూర్‌లో లేని వ్యవస్థకు ఏపీ శ్రీకారం చుట్టింది. ఎల్‌ఈడీ బల్బులు నూతన ఆవిష్కరణ.. ప్రకృతి వ్యవసాయం మరో ఆవిష్కరణ. యావత్ ప్రపంచమే ఇప్పుడు మన వైపు చూస్తోందని సీఎం అన్నారు.

కేంద్రం దేనికీ సహకరించకున్నా.. తమ కష్టంతో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. జన్మభూమిలో ఇప్పటివరకు 4,57,007 వినతులు అందాయి. అందులో 3,10,000 తనిఖీ చేశాం, పరిష్కరించాం. 35వేల వినతులు మాత్రమే తిరస్కరించామని తెలిపారు. మొదటి జన్మభూమికి 40లక్షల వినతులు వచ్చాయి. ఈ జన్మభూమికి 4.5లక్షల వినతులు అందాయి. ప్రజల్లో సంతృప్తి శాతానికి ఇదే రుజువు. వినతుల సంఖ్య తగ్గడమే మన పనితీరుకు నిదర్శనం. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.