అక్కడ నిల్చొని పనిచేయవచ్చు

అక్కడ నిల్చొని పనిచేయవచ్చు

కూర్చోవడం కొత్త రకం కేన్సర్ అని తెలిసిందే. కానీ టెక్నాలజీ ఉద్యోగుల పనే గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని కుస్తీలు పట్టడం. మరి ఎంతో విలువైన ఉద్యోగుల ప్రాణాలు రక్షించే బాధ్యత సంస్థదే కదా. ఈ విషయాన్నే టెక్నాలజీ దిగ్గజ సంస్థ, యాపిల్ గుర్తించింది. తన ఉద్యోగులను కూర్చోబెట్టి వ్యాధిగ్రస్తులను చేయకుండా జాగ్రత్తలు చేపట్టింది. తన కార్యాలయంలో సిబ్బందికి స్టాండింగ్ డెస్క్ లు ఏర్పాటు చేస్తోంది.

యాపిల్ సంస్థతో ఉద్యోగం అంటేనే ఎంతో ప్రతిష్ఠతో కూడుకున్నది. మిగతా సంస్థల కంటే ముందుగా సాంకేతికతను అంది పుచ్చుకోవడం యాపిల్ ప్రత్యేకత. దీంతో యాపిల్ లో ఉద్యోగం అంటేనే అంతా ఆ కిక్కే వేరప్పా అనుకుంటారు. ఇక కాలిఫోర్నియాలోని శాంటా క్లారా వ్యాలీలో 175 ఎకరాల మేర ఓ స్పేస్ షిప్ మాదిరిగా కనిపించే యాపిల్ క్యాంపస్ లోకి ఓసారి అడుగుపెట్టినవారు వారెవ్వా అనుకోకుండా ఉండరు. తమ ఉత్పత్తుల మాదిరిగానే తమ ఆవరణ, అందులోని ప్రతి చిన్న అంశం వైవిధ్యంగా ఉండాలని భావించే యాపిల్ సంస్థ ఉద్యోగులకు భారీ జీతాలతో పాటు వారి ఆరోగ్యంపైనా ఎనలేని శ్రద్ధ చూపిస్తుంది. అందులో భాగంగా యాపిల్ సంస్థ ఉద్యోగులకు ఆరోగ్యకర జీవనశైలిని అందించేందుకు వారికి నిలబడి పనిచేసేందుకు స్టాండింగ్ డెస్క్ లు అమర్చాలనే కీలక నిర్ణయం తీసుకుంది.