మెస్సి జట్టుకు తిప్పలే...

మెస్సి జట్టుకు తిప్పలే...

రష్యా వేదికగా జూన్ 14 నుండి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభమవనుంది. ఈ ప్రపంచకప్‌లో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, ఎచ్ గ్రూపులుగా షెడ్యూల్ చేశారు. ఈ అన్ని గ్రూపులలో బలమైన జట్లే ఉన్నా.. గ్రూపు 'డి'లో మాత్రం అత్యంత పోటీ నెలకొంది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టు టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. మ్యాచ్ లలో విజయకేతనం ఎగురవేయడం అంత తేలికేమీ కాదు. గ్రూప్ 'డి'లో అర్జెంటీనాతో పాటు ఐస్‌లాండ్‌, క్రొయేషియా, నైజీరియా జట్లు ఉన్నాయి. ఈ  జట్లన్ని అనుభవజ్ఞులతో కూడిన ప్రమాదకర జట్లు. ఎప్పుడు కూడా సంచలన విజయాలతో ఈ గ్రూప్ జట్లన్ని రికార్డులు సృష్టిస్తుండటంతో.. మెస్సి జట్టుకు తిప్పలు తప్పేట్లు లేవు.

టోర్నీలోనే బలమైన జట్లలో ఒకటి అయిన అర్జెంటీనా జట్టు అతికష్టంగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్‌ ఆఖరి మ్యాచ్‌లో ఈక్వెడార్‌పై స్టార్ ప్లేయర్ లియోనల్‌ మెస్సి హ్యట్రిక్‌ కొట్టడంతో అర్జెంటీనా జట్టు బయటపడింది. అర్జెంటీనా జట్టులో మెస్సితో పాటు గొంజాలో హిగెయిన్‌, అగ్వెరో ఉన్నారు. కానీ ఈ ముగ్గురు ఆటగాళ్లు ఫామ్ లోకి రావాల్సిఉంది. ఈ సంవత్సరంలోనే అర్జెంటీనాకు ముగ్గురు కోచ్‌లు మారారు.. ఇది కూడా జట్టు వైఫల్యాలపై ప్రభావం చూపింది. గత కొంత కాలంగా జట్టు పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో విజయాలు సాధించి.. గ్రూపులో అగ్రస్థానం పొందటం అర్జెంటీనాకు సవాలే.

ప్రపంచకప్‌కు అర్హత సాధించిన మరో జట్టు నైజీరియా. గత నవంబరులో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో అర్జెంటీనాపై 4-2తో గెలవడం నైజీరియా జట్టుకు పెద్ద సానుకూలాంశం. అలెక్స్‌ ఇవోబి, కెలెచి ఇహియాంచో, విక్టర్‌ మోసెస్‌లు కీలక పాత్ర పోచించనున్నారు. ఇక నాణ్యమైన ఆటగాళ్లతో కూడిన ఐస్‌లాండ్‌కు సంచలనాలు  సృష్టించడం కొత్తేమీకాదు. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఐస్‌లాండ్‌కు మిగితా జట్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. క్రొయేషియా, టర్కీ, ఇంగ్లాండ్‌ వంటి జట్లపై గెలిచిన అనుభవమున్న ఐస్‌లాండ్‌ ప్రపంచకప్‌లో కూడా సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. ఆరోన్‌ గునర్సన్‌, సిగుర్డ్‌సన్‌ ఆటగాళ్లు ఐస్‌లాండ్‌ జట్టుకు అదనపు బలం. మరోవైపు అత్యంత ప్రతిభావంతులతో కూడిన జట్టు క్రొయేషియా. లుకా మోర్దిచ్‌, మ్యాటో కొవాసిచ్‌, ఇవాన్‌ రకితిచ్‌లతో కూడి మిడ్‌ఫీల్డర్లు.. మారియో మంజుకిచ్‌, ఇవాన్‌ పెరిసిచ్‌ల రూపంలో ఫార్వర్డ్‌లూ ఉన్నారు. గతంలోలాగే జట్టు ప్రదర్శనను కొనసాగిస్తే క్రొయేషియా ముందుకు దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న అర్జెంటీనా జట్టుకు విజయాలు కష్టమే. 

Photo: FileShot