ఫాలోఆన్‌ ఆడుతున్న ఆసీస్

ఫాలోఆన్‌ ఆడుతున్న ఆసీస్

సిడ్నీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసీస్ ఫాలోఆన్‌ ఆడుతోంది. నాలుగవ రోజు వర్షం అనంతరం మొదలైన రెండవ సెషన్ లో భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 322 పరుగుల ఆధిక్యం దక్కింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్ ను ఫాలోఆన్‌ ఆడిస్తున్నాడు. టీ బ్రేక్ సమయానికి ఆసీస్ 4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 6 పరుగులు చేసింది. క్రీజ్ లో ఖవాజా (4), హర్రీస్ (2)లు ఉన్నారు. 

నాలుగవ రోజు వర్షం కారణంగా మొదటి సెషన్ ఒక్క బంతి కూడా పడకుండానే వర్షార్పణం అయింది. వర్షం తగ్గడంతో లంచ్ బ్రేక్ అనంతరం ఆట ప్రారంభం అయింది. 236/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ ఆదిలోనే వికెట్ ను కోల్పోయింది. షమీ.. కమ్మిన్స్ (25)ను బోల్డ్ చేసాడు. అనంతరం బుమ్రా.. హాండ్స్‌కాంబ్‌ (37)ను బౌల్డ్‌ చేసాడు. ఆ తర్వాతి ఓవర్లో ఓవర్లో కుల్‌దీప్‌.. నాథన్‌ లైయన్‌ (0) ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఈ సమయంలో స్టార్క్, హేజిల్ వుడ్ లు భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఈ జోడి చివరి వికెట్ కు 42 పరుగులు జోడించింది. చివరకు కుల్దీప్.. హేజిల్ వుడ్ (21) ఎల్బీగా అవుట్ చేసాడు. స్టార్క్ (29) నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ నాలుగో రోజు 20 ఓవర్లు ఆడి 64 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్‌ ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. షమీ, జడేజా చెరో రెండు వికెట్లు.. బుమ్రా ఒక వికెట్ తీశారు.