బ్యాడ్‌లైడ్.. ముగిసిన ఆట

బ్యాడ్‌లైడ్.. ముగిసిన ఆట

సిడ్నీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఒకవైపు వర్షం, మరోవైపు వెలుతురులేమితో.. మొదటగా తాత్కాలికంగా మ్యాచ్‌ ఆపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మేఘాలు కమ్మడంతో టీ బ్రేక్ అనంతరం వెలుతురులేమితో ఆట సాగలేదు. సమయం గడుస్తున్నా.. వాతావరణంలో మార్పు రాకపోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. నాలుగవ రోజు కేవలం 25.2 ఓవర్ల ఆట మద్యమే సాధ్యపడింది. దీంతో వరుణుడు భారత విజయ అవకాశాలను క్లిష్టం చేసాడు. చివరి రోజు అయినా వరుణుడు కరుణిస్తే.. ఆసీస్ ఆలౌట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆసీస్ ఆటగాళ్లు వికెట్లను అడ్డుకుంటే డ్రా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి భారత్ విజయావకాశాలు వరుణుడుపై ఆధారపడి ఉన్నాయి.

నాలుగవ రోజు వర్షం కారణంగా ఉదయం 3 గంటల పాటు ఆట సాగలేదు. వర్షం తగ్గడంతో రెండవ సెషన్ లో ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోర్ 236/6తో నాలుగో రోజు ఆట ఆరంబించిన ఆసీస్.. భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్‌కు 322 పరుగుల భారీ ఆధిక్యం దక్కడంతో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్ ను ఫాలోఆన్‌ ఆడించాడు. టీ బ్రేక్ అనంతరం వెలుతురులేమి కారణంగా ఆట నిలిచిపోయింది. మళ్లీ ఆట సాధ్యపడలేదు. ఆట నిలిచే సమయానికి ఆసీస్ 4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 6 పరుగులు చేసింది. క్రీజ్ లో ఖవాజా (4), హర్రీస్ (2)లు ఉన్నారు. ఆసీస్ ఇంకా భారత్ మొదటి ఇన్నింగ్స్‌కు 316 పరుగులు వెనుకబడి ఉంది.