మంచినీళ్ల కోసం పోరాడారు.. గెలిచారు...

మంచినీళ్ల కోసం పోరాడారు.. గెలిచారు...

Image: foodandwaterwatch.org

చాలా కార్పొరేట్ కంపెనీలకు మంచినీరు ఓ పెద్ద వ్యాపార వస్తువైపోయింది. దీంతో పేదలు మంచినీళ్లు కొనుక్కునే స్తోమత లేక, అవి అందుకునే దారి లేక జబ్బులపాలవుతున్నారు. దీనిమీద కొంతకాలంగా పోరాడుతున్న అమెరికాలోని స్వచ్ఛంద సంస్థ... ఎట్టకేలకు బాల్టిమోర్ సిటీలో వాటర్ ప్రైవేటైజేషన్ ను నిషేధించగలిగింది. మంచినీటి ప్రైవేటైజేషన్ ను ఎత్తివేయాలన్న క్యాంపెయినింగ్ తో పట్టణవ్యాప్తంగా వోటింగ్ నిర్వహించింది. ఈ ఓటింగ్ లో ప్రజలంతా ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా మద్దతు తెలిపారు. 91 శాతం ప్రజలు ఓటింగ్ లో పాల్గొనగా.. 77 శాతం మంది మంచినీటిని ప్రజలపరం చేయాలని తేల్చిచెప్పారు. ఈ ఓటింగ్ తో నీటిని అమ్ముకునే కార్పొరేట్ శక్తుల ఆటలు సాగవు. నిర్దిష్టమైన మంచినీటికి స్థాయికి తగిన మొత్తాన్ని మాత్రమే వెచ్చించేలా సిటీ చార్టర్లో నిబంధన పొందుపరచారు. 

సముద్ర తీరాన ఉన్న బాల్టిమోర్ లో కొన్నేళ్లుగా మంచినీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. బస్తీల్లో, మురికివాడల్లో ఉండే పేదప్రజలు మంచినీరు కొనుక్కునే స్తోమత లేక అల్లాడుతున్నారు. ఇది గమనించిన ఫుడ్ అండ్ వాటర్ వాచ్ అనే స్వచ్ఛంద సంస్థ.. అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. వాళ్ల కార్యక్రమాల ఫలితంగా గతేడాదే నగర పాలకమండలి కూడా ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. కానీ అమలు కాలేదు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన ఆ సంస్థ ఓటింగ్ నిర్వహించింది. ఇదే స్ఫూర్తితో అమెరికాలోని ఇతర పట్టణాల్లో కూడా పని చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.