బెల్జియం ఈజీగా నాకౌట్‌కు...

బెల్జియం ఈజీగా నాకౌట్‌కు...

ఫుట్‌బాల్‌ ఆట అనగానే గుర్తొచ్చే జట్లు జర్మనీ, బ్రెజిల్‌. ఆ తర్వాత బెల్జియం కూడా వాటి సరసన నిలుస్తుంది. బెల్జియం వెటరన్ ఆటగాళ్లంతా ఇదే అత్యుత్తమ జట్టని కొనియాడారు. సీనియర్లు, జూనియర్లతో కూడిన ప్రస్తుత జట్టు అత్యంత పటిష్టంగా ఉండటంతో.. బెల్జియం ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఇక  గ్రూప్-జి లో బెల్జియంతో పాటు ట్యునీసియా, పనామా, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి. ట్యునీసియా, పనామాలు చిన్న జట్లే కావడంతో.. బెల్జియం, ఇంగ్లండ్‌ లు నాకౌట్‌కు చేరే అవకాశాలు చాలా ఉన్నాయి.

బెల్జియం: గోల్‌కీపింగ్‌, మిడ్‌ఫీల్డ్‌, డిఫెన్స్‌, ఫార్వర్డ్‌ అన్ని విభాగాల్లో నాణ్యమైన ఆటగాళ్లతో బెల్జియం కళకళలాడుతుంది. ప్రపంచ మేటి గోల్‌కీపర్‌ థిబౌట్‌ కౌర్టోయసను జట్టులో ఉండటం బెల్జియంకు పెద్ద సాకూలాంశం. థిబౌట్‌ మైందానంలో ఉండగా గోల్‌ చేయడం ప్రత్యర్థులకు తలకుమించిన భారమే. ఇక మిడ్‌ఫీల్డర్‌ కెవిన్‌ డి బ్రూయిన్‌, ఫార్వర్డ్‌ ఎడెన్‌ హజార్డ్‌.. జాన్‌ వెర్టోన్‌ఘెన్‌, విన్సెంట్‌ కాంపెనీల దాటుకొని ప్రత్యర్థి జట్లు ముందుకు వెళ్లడం అసాధ్యమే. ప్రస్తుత జట్టు 2014 ప్రపంచకప్‌, యూరో 2016 బరిలోకి దిగినా..  ఆశించిన ఫలితాలు రాలేదు. ఆటగాళ్ల మధ్య సమన్వయలోపం కారణంగా తప్పిదాలు జరిగాయి. మరి ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో జట్టు మొత్తం కలిసి ఆడితే సునాయాసంగా రౌండ్‌-16కు చేరవచ్చు.. అంతేకాదు కప్పు కూడా సొంతమవుతుంది.

ఇంగ్లండ్‌: జట్టు మొత్తం యువకులతో నిండిన ఇంగ్లండ్‌కు క్వాలిఫయింగ్‌ టోర్నీలో అదరగొట్టింది. ఫిఫా కప్ లో అత్యంత వేగంగా ఆడే జట్లలో ఇంగ్లండ్‌ ఒకటి. బెల్జియం మాదిరి ప్రతి విభాగంలోనూ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారు. మేటి స్ట్రయికర్‌ హారీ కేన్‌, రహీమ్‌ స్టెర్లింగ్‌, మార్కస్‌ రాష్‌ఫోర్డ్‌ తో పాటు డాలీ వెల్‌బెక్‌, జెమీవార్డీ అనుభవం ఇంగ్లాండ్ కు సానుకూలాంశం. ఒత్తిడిని తట్టుకోలేక కీలక సమయాల్లో ఇంగ్లండ్‌ చేతులెత్తేస్తుండటం జట్టు ప్రతికూలత. ఈ ఒక్కటి అధిగమిస్తే ఇంగ్లాండ్ కు తిరుగుండదు.

ట్యునీసియా: క్వాలిఫయింగ్‌ టోర్నీలో అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది ఐదోసారి ప్రపంచక్‌పలో అడుగుపెట్టింది ట్యునీసియా. పెద్ద జట్ల మాదిరి స్టార్లు లేకపోయినా.. మిడ్‌ఫీల్డర్లే మ్యాచ్ ను  శాశిస్తున్నారు. ఆటగాళ్లలోని సమన్వయం జట్టుకు కలిసివచ్చే అంశాలు. ప్రధాన ఆటగాళ్లు గాయాలతో బాధపడుతుండడం కొంచెం కలవరపెట్టే విషయం.

పనామా: క్వాలిఫయింగ్‌ టోర్నీలో అనూహ్యంగా అమెరికాను వెనక్కు నెట్టి తొలిసారి వరల్డ్‌ కప్‌ బెర్త్‌ సాధించింది పనామా. పోరాడే పటిమ పనామా జట్టుకు పెద్ద అనుకూలం. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన పనామా జట్టు సమతూకంగా ఉండడం కలిసొచ్చేదే. క్వాలిఫయర్స్‌లో కీలక పాత్ర పోచించిన రోమన్‌ టోరెస్‌ గాయంతో తప్పుకోవడం పెద్ద ప్రతికూలం.