పరీక్ష రాసేందుకు వెళ్తూ....

పరీక్ష రాసేందుకు వెళ్తూ....

ముగ్గురు మిత్రులు కలిసి పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద చోటు చేసుకుంది. ఘట్ కేసర్ మండలం అవుషాపూర్ శివారులోని వీబీఐటీ కళాశాలలో పరీక్షలు రాసేందుకు స్నేహితుడు సాయిరాంతో కలిసి నేలపట్ల శివ స్కూటీపై బయలుదేరాడు. మార్గమధ్యలో బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామానికి చెందిన మామిళ్ల భరత్ అనే మరో స్నేహితుడిని బీబీనగర్ లో స్కూటీపై ఎక్కించుకుని ముగ్గురు కలిసి వీబీఐటీ కళాశాలకు బయలు దేరారు. 

కొండమడుగు మెట్టు సర్కిల్ వద్ద కళాశాలకు వెళ్లేందుకు కుడివైపున ఉన్న సర్వీసు రోడ్డుకు స్కూటీని టర్న్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వేగంగా వెళ్తున్న మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ విజయ్ పాల్ రెడ్డికి చెందిన ప్రభుత్వ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ పై ఉన్న ముగ్గురు రోడ్డుపై ఎగిరిపడ్డారు. స్కూటీ నడుపుతున్న శివ డివైడర్ పై పడి తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సాయిరాం, భరత్ లకు గాయాలయ్యాయి. భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.