ఎన్నారై పెళ్ళిళ్ళ‌పై బిల్లు

ఎన్నారై పెళ్ళిళ్ళ‌పై బిల్లు

మోసపూరితంగా భారతీయ మహిళలను వివాహమాడుతున్న ప్రవాస భారతీయుల (ఎన్నారై) కేసుల నేపథ్యంలో ఎన్నారై పెళ్లిళ్లను 30 రోజుల్లోగా రిజిస్టర్ చేయడం తప్పనిసరి చేస్తూ రాజ్యసభలో ఇవాళ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా ఎన్నారై పురుషుడు తన పెళ్లయిన 30 రోజుల్లోగా రిజిస్టర్ చేయించకపోతే అతని పాస్ పోర్ట్ ని స్వాధీనం చేసుకోవడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. అలాగే చట్టాన్ని అతిక్రమించినవారు లేదా వారిపై వారంట్లు జారీ చేసినప్పటికీ కోర్టులో హాజరు కానీ వారి అన్ని స్థిర,చరాస్తులను కోర్టులు అటాచ్ చేసేందుకు అనుమతిస్తుంది.

పెళ్లయిన 30 రోజుల్లోగా తమ వివాహాన్ని రిజిస్టర్ చేయకపోతే ఆ ఎన్నారైల పాస్ పోస్ట్ లేదా ప్రయాణ పత్రాలను పాస్ పోర్ట్ అధికారులు జప్తు చేయడం లేదా రద్దు చేసే అధికారాన్ని ఈ 'రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజీ ఆఫ్ నాన్-రెసిడెంట్ ఇండియన్ బిల్, 2019' కల్పిస్తుంది. భారత్ లేదా విదేశాల్లో భారతీయ మహిళలను పెళ్లాడే ఎన్నారైలకి కూడా ఈ చట్టం వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు.

బడ్జెట్ సమావేశాలు బుధవారంతో ముగియనున్నాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు కావడంతో ఈ బిల్లు ఆమోదం పొందడం కష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టినందువల్ల అక్కడ పెండింగ్ లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత (16వ) లోక్ సభ జూన్ 3న రద్దు కానుండటంతో ఈ బిల్లుకి కాలదోషం పట్టదు.