ఏపీ ప్రజలకు అమిత్‌షా బహిరంగ లేఖ..

ఏపీ ప్రజలకు అమిత్‌షా బహిరంగ లేఖ..

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన...  ఆ వెంటనే ఢిల్లీ వేదికగా సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధాన్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు బహిరంగలేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేం అని భయంతో చంద్రబాబు “యూ టర్ను” తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు తన ప్రచార  “హెడ్ లైన్స్” లో ఉండాలని భావిస్తున్నారని సెటైర్లు వేసిన షా.. “యూటర్న్” లకు  చంద్రబాబు ఒక పెద్ద ఉదాహరణ అంటూ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఏపీకి వస్తే కనీస గౌరవం ఇవ్వలేదని మండిపడ్డ బీజేపీ చీఫ్.. విజ్ఞత లేని వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పంచన చేరి చంద్రబాబు “యూ టర్న్” తీసుకున్నారన్న ఆయన.. ప్రత్యేక హోదా సంజీవని కాదని గతంలో చంద్రబాబు అన్నారని.. ప్రత్యేక హోదా కోరిన వారిని అరెస్టు చేయించారని.. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు బాగుపడలేదని చంద్రబాబు గతంలో చెప్పారని.. ఇప్పుడు హోదా కోసం “యూ టర్న్” తీసుకున్నారని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబులో ఇంకా కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోందని తన లేఖలో పేర్కొన్నారు బీజేపీ చీఫ్ అమిత్‌షా.. అబద్ధాలు చెప్పే సంస్కృతిని అమలు చేస్తున్నారన్న ఆయన.. ఊసరవెల్లి సిగ్గుపడే అంతగా చంద్రబాబు రంగు మారుస్తున్నారనంటూ మండిపడ్డారు. ఎన్నికల స్టంట్ లో భాగంగా శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపించిన షా.. విభజన చట్టంలోని అనేక వాగ్దానాలను పదేళ్ల సమయం ఉన్నా, నాలుగేళ్లలోనే మా ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే కడప స్టీల్ ప్లాంట్ పై  కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేక పోయిందన్నారు అమిత్‌షా.