'ఢిల్లీలో చంద్రబాబుది కొంగ జపం..'

'ఢిల్లీలో చంద్రబాబుది కొంగ జపం..'

ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షపై సెటైర్లు వేశారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ... విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీలో చంద్రబాబుది కొంగ జపం అంటూ ఫైర్ అయ్యారు. హోదా కోసం ఢిల్లీలో జగన్ దీక్షలు చేస్తే టీడీపీ హేళన చేసిందన్న బొత్స.. ప్రధాని మోడీ మట్టి, నీరు.. అమరావతి నిర్మాణానికి తెచ్చిన రోజే నిరసన తెలియజేశామని గుర్తుచేశారు. కేంద్రంతో ఘర్షణ వైఖరికి వద్దని టీడీపీ అప్పట్లో చెప్పందన్న బొత్స.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ ఇద్దరే అని విమర్శించిన వైసీపీ నేత.. నాలుగేళ్లుగా కలిసి కాపురం చేసిన మోడీ, బాబు ఒకరిని ఒకరు తిట్టుకోవటం ప్రజలను మోసగించడమే అన్నారు. 

నరేంద్ర మోడీ, చంద్రబాబుల గొడవ పంపు దగ్గర తగువుల మాదిరి ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ. ప్రధాని గుంటూరులో స్థాయి తగ్గించుకుని మాట్లాడారన్న ఆయన.. సీఎం చంద్రబాబు ఇష్టారాజ్యంగా బెజవాడలో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ, టీడీపీ నేతల వైఖరి వల్ల రాజకీయాలు అంటే ప్రజల్లో మరింత చులకనవుతున్నాయన్నారు. ఇక ఆటోలపై జగన్ ఫోటోలను చూసి జగన్ ఆదరణ లోకేష్ తెలుసుకోవాలన్నారు బొత్స.. ప్రధాని మోడీ సభకు వైసీపీ జనాలను పంపామని అనేవారికి సిగ్గుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీనియారిటీ ఎవరికి ఉపయోగం లేదన్న బొత్స.. చంద్రబాబు వలలో పడవద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.