'బాబుకి ఎందుకంత భయం?'

'బాబుకి ఎందుకంత భయం?'

జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ జోక్యంపై ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాసిన లేఖ చూస్తుంటే నవ్వొస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎంత భయపడుతున్నారో ఈ లేఖను చూస్తుంటేనే అర్థమవుతోందన్నారు. ఫెడరల్‌ స్ఫూర్తి పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్షాలపై.. ఆ పార్టీ నేతలపై హత్యాయత్నం జరిగినా కేంద్ర సంస్థలు జోక్యం చేసుకోకూడదనేలా బాబు లేఖ ఉన్నదని ఆయన అన్నారు. ఎన్‌ఐఏ విచారణ చేయాలని న్యాయస్థానం కూడా తీర్పునిచ్చిందని ఆయన అన్నారు. 

పరిటాల రవి హత్య వెనుక‌ జగన్ వున్నారని గతంలో ఆరోపణలొచ్చినప్పుడు సీబీఐ విచారణకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ ఆదేశించారని.. మరి ఇప్పుడు చంద్రబాబుపై దాడి కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తే బాబు ఎందుకు భయపడుతున్నారని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇందులో ప్రమేయం, భాగస్వామ్యం లేకపోతే ఆయన ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. హత్యా రాజకీయాలపై చంద్రబాబు ఆధారపడి బతుకుతున్నారని బొత్స ఆరోపించారు. 'జగన్‌పై దాడి కేసులో మీ ప్రమేయం లేకపోయినా.. మీ పర్యవేక్షణలో ఆ ఘటన జరగకపోయినా ఎన్‌ఐఏ విచారణకు సహకరించండి' అని సూచించారు.