ఆపరేషన్ బ్లూ స్టార్ కి 34 ఏళ్లు

ఆపరేషన్ బ్లూ స్టార్ కి 34 ఏళ్లు

సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే అమృత్ సర్  స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించి 34 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఆ ఆపరేషన్ కు సంబంధించిన పత్రాలు, అందులో బ్రిటన్ పాత్ర గురించి ఎవరికీ తెలియదు. ఈ వ్యవహారం తెరపైకి వచ్చినపుడల్లా భారత్ తో దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బ్రిటన్ ప్రభుత్వం దాటవేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఓ బ్రిటిష్ జడ్జి ఆపరేషన్ బ్లూస్టార్ కి సంబంధించిన పత్రాలన్నిటినీ బహిర్గతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భారత సైన్యం అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలోకి చొచ్చుకుపోయినపుడు ఆనాటి మార్గరెట్ థాచర్ ప్రభుత్వం ఏ విధంగా సాయపడిందో పరిశోధిస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఫిల్ మిల్లర్ సమాచార స్వేచ్ఛ కింద కోర్టులో అప్పీల్ చేశారు. ఆపరేషన్ బ్లూస్టార్ కు దారితీసిన పరిస్థితులు, అందులో బ్రిటన్ పాత్రపై విచారణ చేపట్టిన జడ్జి ముర్రే షాంక్స్ బ్లూస్టార్ ఫైళ్లను బయటపెట్టాల్సిందేనని ప్రకటించారు. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తింటాయన్న బ్రిటన్ ప్రభుత్వ వాదనను ఆయన కొట్టిపారేశారు. ఇండియా: పొలిటికల్ అన్న ఒక్క పైలుని మాత్రం బయటపెట్టనక్కర్లేదని మినహాయించారు. అందులో బ్రిటన్ నిఘా వర్గాల నివేదికలు ఉండే అవకాశం ఉన్నందున దానిని సమాచార స్వేచ్ఛ నుంచి తప్పిస్తున్నట్టు తెలిపారు. 

ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టిన భారత దళాలకు బ్రిటిష్ మిలిటరీ సలహాలు ఇచ్చిందని భావిస్తున్నారు. కోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో 1983-85 నాటి బ్రిటన్-భారత్ సంబంధాలు, థాచర్ తో ప్రధాని ఇందిరాగాంధీ సలహాదారు ఎల్.కె. ఝా భేటీ వివరాలు, 1984 అక్టోబర్ లో ఇందిర హత్యకు దారితీసిన పరిణామాలు తేటతెల్లం అవుతాయని అంటున్నారు.