'బళ్లారిలో బీజేపీ ఓటమికి కారణం ఆయనే..'

'బళ్లారిలో బీజేపీ ఓటమికి కారణం ఆయనే..'

కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీ నేతల నోళ్లు మూగబోయాయని ఏపీ ప్రభుత్వ విప్‌ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆ పార్టీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్‌ నరసింహారావు ఎక్కడికి వెళ్లిపోయారంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ అమరావాతిలో బుద్దా మాట్లాడుతూ బళ్లారిలో బీజేపీని చిత్తుగా ఓడించారంటే చంద్రబాబునాయుడే ముఖ్యకారణమని అన్నారు. కర్ణాటకలో మోడీకి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాక్షస పాలన అంతం ఆరంభమైందన్న ఆయన.. దీపావళి ముందు రోజు వచ్చిన ఫలితంతో దేశ ప్రజలంతా పండుగను మరింత ఉత్సాహంతో చేసుకున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ దత్తపుత్రుడు గాలి జనార్దనరెడ్డి కోసం అధికారులు ఎక్కడెక్కడో తిరగకుండా.. జగన్ లోటస్ పాండ్‌కు వెళ్తే చాలని అన్నారు. 'కోడి కత్తి విషయంలో ఇంత జరిగినా జగన్ నోరు మెదపటం లేదు. ఢిల్లీ లెవల్లో స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో జగన్ సైలెంట్ అయిపోయారు. పాదయాత్రకు వెళ్తే జనాలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే ‌విరామం ప్రకటించారు' అని వెంకన్న విమర్శించారు.