జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం..

జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్థరాత్రి వేళ యువతులు కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించారు. నలుగురు యువతుల కారు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిలింనగర్ వైపునకు అతి వేగంతో దూసుకొచ్చి.. స్కూటీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్లే ఇద్దరు వ్యక్తులు  తీవ్రంగా గాయపడ్డారు. మితిమీరిన వేగంతో వచ్చిన కారు బోల్తాకొట్టింది. కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో యువతులకు స్వల్పగాయాలయ్యాయి. బోల్తాపడ్డ కారులో ఇరుక్కున్న నలుగురు యువతుల్ని స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. 

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో నివాసముండే ఉషాభాగ్య అనే యువతి తన స్నేహితురాళ్లు అనితారెడ్డి, తరుణాసింగ్, సోనమ్ సింగ్ తో అర్థరాత్రి వేళ కారులో బయలుదేరింది. ఉషాభాగ్య కారు అతివేగంతో నడపసాగింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిలింనగర్ మార్గంలో AP 09 CW 3342 నెంబరు గల యువతులు ప్రయాణిస్తున్నకారు అతివేగంతో దూసుకొస్తుంది. హోటల్లో చెఫ్ డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్తున్న హరినారాయణ, అతని మిత్రుడు దినేష్ కుమార్ TS 05 EN 5415 నెంబరు గల స్కూటీపై వెళ్తున్నారు. యువతుల కారు అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న హరినారాయణతో పాటు.. అతని మిత్రుడు దినేష్ కుమార్ లకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.