వ‌ర్మపై వేటుకు కార‌ణం ఇదే...

వ‌ర్మపై వేటుకు కార‌ణం ఇదే...

అలోక్‌వ‌ర్మను శ‌ర‌వేగంగా ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తొంద‌ర‌ప‌డిందో ఇపుడు  వెల్లడైంది. సుప్రీం కోర్టు తీర్పు త‌ర‌వాత ప‌ద‌వీ బాధ్యత‌లు చేప‌ట్టిన వెంట‌నే అలోక్ వ‌ర్మ కొన్ని కీల‌క ఫైల్స్‌పై సంత‌కం చేశారు. అలాగే కొంత మంది అధికారుల‌ను బ‌దిలీ చేశారు. వ‌ర్మ‌ను బ‌దిలీ చేసిన వెంట‌నే తాత్కాలిక బాస్‌గా నాగేశ్వర రావు ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న కూడా మ‌ళ్ళీ బాస్ కాగానే... వెంట‌నే వ‌ర్మ చేసిన బ‌దిలీల‌ను నిలుపుద‌ల చేశారు. అయితే మ‌రో కీల‌క నిర్ణ‌యం కూడా తీసుకున్నారు. మ‌ళ్ళీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర‌వాత బుధ‌, గురువారాల్లో ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్న‌వాటిని కూడా ఆయ‌న ర‌ద్దు చేశారు. ఆయ‌న సంత‌కం చేసిన ఫైళ్ళు అస‌లు ఆఫీసులో లేన‌ట్లుగా ప‌రిగ‌ణించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఇంత‌కీ వ‌ర్మ సంత‌కం చేసిన ఫైల్స్‌ను ప‌రిశీలిస్తే... ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి కార్య‌ద‌ర్శిగా ఉన్న భాస్కర్ ఖుల్బేపై సీబీఐ విచార‌ణ‌కు వ‌ర్మ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలిసింది. బొగ్గు కుంభ‌కోణంలో ఈయ‌న పాత్ర ఉన్న‌ట్లు సీబీఐ విచార‌ణ‌లో తేలింది. అయితే కుంభ‌కోణం జ‌రిగిన‌పుడు బొగ్గు కార్య‌ద‌ర్శిగా ఉన్న హెచ్‌సీ గుప్త‌పై అభియోగాలు న‌మోదు చేసిన సీబీఐ... భాస్క‌ర్‌కు సంబంధించిన ఫైల్‌ను మాత్రం ప‌క్క‌న పెట్టారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని మొయిరా-మ‌ధుజోరే బొగ్గు గ‌నుల‌ను రామ్‌స‌ర‌ప్ లోహ్ ఉద్యోగ్ లిమిటెడ్ అనే కంపెనీకి అక్ర‌మంగా క‌ట్ట‌బెట్ట‌డంలో భాస్క‌ర్ పాత్ర ఉంద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కేటాయింపు స‌మ‌యంలో.. ప‌శ్చిమ బెంగాల్ ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు స‌ల‌హాదారుగా భాస్క‌ర్ ఉన్నారు. సీబీఐ ద‌ర్యాప్తు  స‌మ‌యంలో భాస్క‌ర్ పేరు బ‌య‌ట‌ప‌డింది. కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ కార్య‌ద‌ర్శి హెచ్‌సీ గుప్తాను 12 కేసుల్లో నిందితునిగా  సీబీఐ చేర్చింది. మూడు కేసుల్లో గుప్తాను ప్ర‌త్యేక కోర్టు దోషిగా తేల్చింది కూడా... భాస్క‌ర్ పేరు మాత్రం చేర్చ‌లేదు. బుధ‌వారం మ‌ళ్ళీ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అలోక్ వ‌ర్మ భాస్క‌ర్‌పై చార్జిషీటు దాఖ‌లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నాగేశ్వ‌ర‌రావు ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుక్ష‌ణం స‌ద‌రుపు ఫైల్ లేన‌ట్లుగా భావించాల‌ని, ఆ ఫైల్ ఆధారంగా తీసుకున్న చర్య‌లకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేదంటూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.