ఆలోక్ వర్మ కేసు తీర్పు వాయిదా

ఆలోక్ వర్మ కేసు తీర్పు వాయిదా

కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను తొలగించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ఆయనతో పాటు ఎన్జీవో కామన్ కాజ్ వేసిన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్ట్ రిజర్వ్ లో పెట్టింది. గురువారం విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ అధికారాలను తొలగించడం అన్యాయమని అభిప్రాయపడింది. ‘సీబీఐలో ఇద్దరు అత్యంత సీనియర్ అధికారుల మధ్య యుద్ధం రాత్రికి రాత్రే ప్రారంభం కాలేదు. అలాంటపుడు ప్రభుత్వం ఎందుకు అంత హడావిడిగా ఎంపిక కమిటీని సంప్రదించకుండా సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ అధికారాలను తొలగించాల్సి వచ్చిందని‘ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని ప్రశ్నించారు. 

‘ప్రభుత్వం న్యాయబద్ధంగా నడచుకోవాలి. ఆలోక్ వర్మ అధికారాన్ని తొలగించే ముందు ఎంపిక కమిటీని సంప్రదించడానికి ఏ అడ్డంకి వచ్చింది? ప్రభుత్వం ప్రతి పనిలో అత్యుత్తమ మార్గాన్ని ఎంచుకోవాలని‘ సీజేఐ గొగోయ్ అన్నారు. వర్మ త్వరలోనే రిటైర్ కాబోతుండగా ప్రభుత్వం అప్పటి దాకా ఎందుకు ఆగలేకపోయిందని ప్రశ్నించారు. ‘అక్టోబర్ 23 అర్థరాత్రి సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ అధికారాలను తొలగించాలనే నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మరికొద్ది నెలల్లోనే వర్మ రిటైర్ కానున్నారు. అప్పటి దాకా ఎందుకు వేచి చూడలేదు? లేదా ఎంపిక కమిటీని ఎందుకు సంప్రదించలేదని‘ కోర్ట్ నిలదీసింది. 

‘అసాధారణ పరిస్థితి తలెత్తినందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు అసాధారణ నివారణ మార్గాలు తప్పవనే‘ నిర్ణయానికి సీవీసీ వచ్చిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకి వివరించారు.