సీబీఎస్‌ఈ... టెన్త్‌ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌

సీబీఎస్‌ఈ... టెన్త్‌ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్‌

పదో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ బంపరాఫర్ ఇస్తోంది. 2020 నుంచి బోర్డ్ పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులు రెండు స్థాయిల్లో గణిత పరీక్ష రాయవచ్చు. రెండు స్థాయిల్లో ఏది ఎంపిక చేసుకుంటారనేది విద్యార్థుల ఇష్టానికి వదిలేయనుంది. విద్యార్థులు మొదటిసారి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నందువల్ల వారిపై ఒత్తిడి లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. అయితే పదో తరగతి మ్యాథ్స్ కరికులమ్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని, అవే టాపిక్స్, చాప్టర్స్ ఉంటాయని బోర్డు తెలిపింది.

సబ్జెక్టుల ఎంపికను విద్యార్థుల ఇష్టానికి వదిలినట్టుగా ఒకే సబ్జెక్టులోనూ వెసులుబాటు ఇవ్వాలని భావించినట్లు చెప్పింది. సబ్జెక్ట్‌ను మొత్తంగా తెలుసుకునే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. చివరగా తన సామర్థ్యాన్ని బట్టి ఎగ్జామినేషన్ ఏ స్థాయిలో రాయాలో తేల్చుకోవచ్చు అని సీబీఎస్‌ఈ అధికారి ఒకరు వెల్లడించారు. పదో తరగతి తర్వాత కూడా గణితాన్నే ప్రధాన సబ్జెక్ట్‌గా ఎంపిక చేసుకునే వాళ్లకు స్టాండర్డ్ ఉపయోగపడుతుంది. పది తర్వాత లెక్కలు వద్దనుకునే వాళ్లు బేసిక్ లెవల్‌కు వెళ్లొచ్చు.

అంటే తొలి స్థాయిలో ఇప్పుడు జరుగుతున్న మ్యాథ్స్ పరీక్షే ఉంటుంది. ఇక రెండో స్థాయిలోని పేపర్ చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడున్న పరీక్షను మ్యాథమెటిక్స్ స్టాండర్డ్‌గా, తేలికగా ఉండే పరీక్షను మ్యాథమెటిక్స్ బేసిక్‌ అని పిలుస్తారు. సిలబస్, క్లాస్ రూమ్ టీచింగ్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ రెండు స్థాయిలకు సమానంగానే ఉంటుంది. రెండు లెవల్స్‌లో దేనిని ఎంపిక చేసుకోవాలో సంబంధిత స్కూల్ కు క్యాండిడేట్స్‌ లిస్ట్ ఇచ్చే సమయంలో విద్యార్థి చెపాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మ్యాథ్స్‌లో ఫెయిలైతే బేసిక్ ఎంచుకున్న విద్యార్థి అదే స్థాయిలో సప్లిమెంటరీ పరీక్ష రాయాలి. కానీ స్టాండర్డ్ ఎంచుకున్న విద్యార్థి స్టాండర్డ్ లేదా బేసిక్‌లో ఎగ్జామ్ రాయొచ్చు. ఒకవేళ బేసిక్‌లో పాసైన విద్యార్థి స్టాండర్డ్ ఎగ్జామ్ రాయాలని అనుకుంటే.. కంపార్ట్‌మెంటల్ గా రాసే వీలు ఉంటుంది.