కేంద్ర బ్యాంకులు బంగారం తెగ కొన్నాయి

కేంద్ర బ్యాంకులు బంగారం తెగ కొన్నాయి

పోయినేడాది ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ 4% పెరిగింది. 2018లో అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేసినట్టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) జనవరి 31న వెల్లడించింది. 1967 తర్వాత ఇంత పెద్ద ఎత్తున కేంద్ర బ్యాంకులు 2018లోనే బంగారం కొన్నట్టు డబ్ల్యుజిసి చెప్పింది. 2017లో ఇది 4,159.9 టన్నులు ఉన్న ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు 2018లో 4,345.1 టన్నులకు చేరినట్టు సంస్థ తన త్రైమాసిక నివేదికలో తెలిపింది. 

ఇంత భారీగా కొనుగోళ్లు జరగడానికి ప్రధాన కారణం వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు 651.5 టన్నుల బంగారం కొనుగోలు చేయడమే. 2017తో పోలిస్తే ఇది 74% అధికం. ఇలా సెంట్రల్ బ్యాంకుల వార్షిక బంగారం కొనుగోళ్లలో ఇది రెండో అత్యధికం కావడం విశేషం. రష్యా, టర్కీ, కజకిస్థాన్ లతో పాటు చైనా, పోలాండ్ వంటి దేశాలు తమ బంగారం నిల్వలు పెంచుకోనేందుకు ఇంత భారీ కొనుగోళ్లు జరిపాయని డబ్ల్యుజిసి తెలిపింది.

ఆభరణాల డిమాండ్ పెద్దగా మారలేదు. ఇది 2,200 టన్నులుగానే ఉంది. చైనా, అమెరికా, రష్యాలలో పెరుగుతున్న కొనుగోళ్లు, పశ్చిమాసియాలో కొనుగోళ్లు బాగా తగ్గుముఖం పట్టడం, భారత్ లో స్వల్ప తరుగుదల దీనికి కారణాలుగా చెబుతున్నారు. బంగారం కడ్డీలు, నాణేలలో పెట్టుబడులు 4% పెరిగి 1,090.2 టన్నులకు చేరాయి. 

ఈ ఏడాది కూడా సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు పెరుగుతాయని డబ్ల్యుజిసి మార్కెట్ ఇంటెలిజెన్స్ హెడ్ ఆలిస్టర్ హెవిట్ అంచనా వేశారు. రెండు అతిపెద్ద బంగారం మార్కెట్లు చైనా, భారత్ లలో కొనుగోళ్లు నిలకడగా ఉంటాయని చెప్పారు. 2019లో చైనా 900-1,000 టన్నులు, భారత్  750-850 టన్నుల బంగారం కొనవచ్చని హెవిట్ తెలిపారు.