మామిడి పండ్లపై చైనా పౌడర్... విజిలెన్స్ దాడులు..

మామిడి పండ్లపై చైనా పౌడర్... విజిలెన్స్ దాడులు..

ఆంధ్రప్రదేశ్ లో మామిడికాయలు మగ్గడానికి చైనా పౌడర్ ను వాడుతున్న కేంద్రాలపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడలలో అధికారులు వరుస దాడులు జరిపి చైనా పౌడర్ తో మగ్గబెట్టి నిల్వచేసిన మామిడి కేంద్రాలను గుర్తించిన అధికారులు వాటిపై కొరడా జరిపారు. 
మచిలీపట్నంలో 2, గుడివాడలో 7, విజయవాడలో 12 టన్నుల మగ్గబెట్టిన మామిడిని గుర్తించిన అధికారులు వెంటనే సీజ్ చేశారు. ఇలా రెండు రోజులు వరుస దాడులు జరిపి 21 షాపులు సీజ్ చేసినట్లు విజిలెన్స్ డీఎస్పీ విజయ్ పాల్ తెలిపారు. 

ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ... మామిడిని మగ్గబెట్టడానికి చైనా పౌడర్ ను వ్యాపారులు వాడుతున్నారని.. పొలాల్లో వాడాల్సిన మందులను ఇక్కడ వాడుతున్నారని వెల్లడించారు. దీని కారణంగా ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుందని వివరించారు. ఇలాంటి ఘటనలపై గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ.. వ్యాపారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదని వివరించారు. నిబంధనలకు విరుద్దంగా రసాయన మందులను వాడుతున్న కొందరిపై కేసులు కూడా పెట్టామని తెలిపారు. అయితే వ్యాపారులు ఈ ఘటనపై స్పందిస్తూ.. కార్బైడ్ స్థానంలో చైనా పౌడర్ ను విడుదల చేసింది ప్రభుత్వమేనని... అలాంటప్పుడు తిరిగి ప్రభుత్వ అధికారులే తరచు కేసులు పెడుతుంటే తాము వ్యాపారాలు చేయలేమని మండిపడుతున్నారు.