మరోసారి కేంద్రంపై మండిపడ్డ ఏపీ సీఎం

మరోసారి కేంద్రంపై మండిపడ్డ ఏపీ సీఎం

అమరావతిలో 15వ ఆర్థిక సంఘంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నాలుగేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, వృద్ధి గణాంకాలపై 15వ ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని సీఎం తెలిపారు. పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఏ అంశాన్నీ అమలు చేయలేదన్నారు. అయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దేశ సంపద వృద్ధికి దోహదపడేలా మా కృషి సాగుతోందని అన్నారు. పురోగామి రాష్ట్రాలను దెబ్బతీయడం మంచిది కాదని హితవు పలికారు. అభివృద్ధి చెందే రాష్ట్రాలకు చేయూత అందించాలని కోరారు. 14వ ఆర్థిక సంఘంపై నెపాన్ని నెట్టి హోదాపై కేంద్రం మాటమార్చిందని సీఎం ధ్వజమెత్తారు.
 
ఆర్థిక సంఘాల నివేదికలకు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి. మధ్యప్రదేశ్‌లో మెట్రోలకు భారీ నిధులు సమకూర్చారు. కానీ విశాఖ, విజయవాడ మెట్రోలకు మాత్రం మోకాలడ్డుతున్నారు. గతంలో నయా రాయపూర్‌కు రూ.4,500 కోట్ల సాయం అందించారు. అమరావతికి కనీసం రూ.9,000 కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇచ్చేలా చూడాలి. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.22,250 కోట్లు సిఫార్సు చేయాలి. కేంద్రం ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకున్నారు అని చంద్రబాబు విమర్శించారు.