ఏ తప్పు చేయలేదు, వారెంట్ జారీ చేశారు

ఏ తప్పు చేయలేదు, వారెంట్ జారీ చేశారు

బాబ్లీ కేసులో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని ఆయన అన్నారు. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి హారతి ఇచ్చి, సున్నిపెంట వద్ద పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, బాబ్లీ ప్రాజెక్టు మరో ప్రాజెక్టు కడితే ఉత్తర తెలంగాణ ఎడారిలా మారుతుందని, ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆరోజు ఉద్యమం చేశామని గుర్తు చేశారు. నాకు బాబ్లీ కేసులో నోటీసులిచ్చామని అంటున్నారు. నేను ఏ నేరం చేయలేదు.. ఘోరాలు చేయలేదు..అన్యాయం అసలు చేయలేదు.. అక్రమంగా కడుతున్న ప్రాజెక్టు ను వ్యతిరేకించాను. ఏమి చేస్తారో చేసుకొండని ఆరోజే నేను పోలీసులకు చెప్పాను అని చంద్రబాబు అన్నారు.

ఎనిమిదేళ్ల క్రితం తాము ప్రాజెక్టు వద్దకు వెళ్తే.. ఏపీ సరిహద్దులోనే అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. ఎన్నోవిధాలుగా ఇబ్బందులు పెట్టారని, ప్రాజెక్టును వ్యతిరేకించడం తప్ప తానేమీ ఇతర తప్పులు చేయలేదని అన్నారు.  కేసులు పెట్టామని ఒకసారి, పెట్టలేదని మరోసారి చెప్పి బలవంతంగా ఒక ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి హైదరాబాద్‌లో వదిలిపెట్టారన్నారు. ఇప్పుడేమో నోటీసులు పంపామని, అరెస్టు వారెంటు ఇచ్చామని మాట్లాడుతున్నారని తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజాహితం కోసం నిరంతరం పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.