జగన్ పాదయాత్రలో చింతమనేని చాక్లెట్లు...

జగన్ పాదయాత్రలో చింతమనేని చాక్లెట్లు...

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ చాక్లెట్లు పంచారు... అదేంటి జగన్ పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యే చాక్లెట్లు ఎందుకు పంచారు? సైకిల్ దిగి చింతమనేని ఫ్యాన్ పార్టీలో చేరతారా? అనే సందేహం వెంటనే రావొచ్చు... కానీ, జగన్ పాదయాత్ర ట్రాఫిక్‌లో చిక్కుకున్న చింతమేని సాధారణ ప్రజలకు చాక్లెట్లు పంచారు... అందులో భాగంగా పాదయాత్రకు వచ్చినవారికి కూడా చాక్లెట్లు ఇచ్చారాయన. 

ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్ పాదయాత్ర ర్యాలీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిక్కుకున్నారు... ఏలూరు రూరల్ మండలం లింగారావుగూడెం దగ్గర జగన్ పాదయాత్ర ఓవైపు... అదే గ్రామంలో చర్చి ప్రారంభోత్సవానికి హాజరైన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోవైపు అయ్యారు. అయితే పాదయాత్ర మధ్యలో ట్రాఫిక్ లో చింతమనేని కాన్వాయ్ చిక్కుకుంది. జగన్ పాదయాత్ర సమయంలో చింతమనేని రావడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు... ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేకుండా మోహరించారు. మరోవైపు ట్రాఫిక్‌లో చిక్కుకున్న చింతమనేని... పాదయాత్రకు వచ్చిన వైసీపీ కార్యకర్తలకు, ప్రజలకు చాక్లెట్ లు పంచి, ఎవరి కార్యక్రమాలు వారివేనంటూ ముందుకు వెళ్లారు.