నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ క్రమంగా పట్టుతప్పింది. బ్లూచిప్‌ షేర్లలో వచ్చిన భారీ అమ్మకాల ఒత్తిడితో నిఫ్టి 69 పాయింట్ల నష్టంతో ముగిసింది. ప్రధానంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్‌లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి నిఫ్టిని దెబ్బతీసింది. ఈ షేర్‌ ఇవాళ ఒకదశలో 35 శాతం క్షీణించి... క్లోజింగ్‌లో కాస్త కోలుకుని 30 శాతం నష్టంతో 299.70 వద్ద ముగిసింది. అలాగే మారుతీ సుజుకీ కూడా 8 శాతం నష్టంతో రూ. 6469 వద్ద ముగిసింది. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్‌ కూడా 7 శాతం నష్టంతో ముగిసింది. దీంతో ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నా..మన మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇవాళ నిఫ్టిలో 32 షేర్లు పతనం కాగా 18 షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌ ఆరు శాతం లాభంతో ముగిసింది. తరవాతి స్థానాల్లో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎస్‌ బ్యాంక్‌, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు ఉన్నాయి. నిఫ్టిలో భారీగా నష్టపోయిన షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 30 శాతం, మారుతీ 8 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 7 శాతం, హీరోమోటో కార్ప్‌ 4 శాతం, ఇండియా హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 4 శాతం నష్టంతో ముగిశాయి. ఇతర షేర్లలో డిష్‌ టీవీ షేర్‌ ఒకదశలో 40 శాతం క్షీణించి తరవాత కోలుకుని 37 శాతం నష్టంతో ముగిసింది.