కోమటిరెడ్డి, సంపత్‌ను ఇంకా ఏం పట్టించుకోవాలి!

కోమటిరెడ్డి, సంపత్‌ను ఇంకా ఏం పట్టించుకోవాలి!

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రోజు సభలో చోటుచేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పీసీసీ సరిగా స్పదించలేదని విమర్శలు వినిపించాయి... కోమటిరెడ్డి, సంపత్ దీంతో కొంత అలకబూనారనే వార్తలు రాగా... కోమటిరెడ్డి మాత్రం పీసీసీ సరైన రీతిలో స్పదించలేదని బహిరంగంగానే విమర్శించారు. అయితే పార్టీ పట్టించుకోవడం లేదనే విషయాన్ని కొట్టిపారేశారు సీఎల్పీ నేత జానారెడ్డి... అదంతా భావన మాత్రమేనని కానీ, ఆ వార్తల్లో నిజం లేదని మీడియా చిట్‌చాట్‌లో ఆయన స్పందించారు. 

కోమటిరెడ్డి, సంపత్ కుమార్ విషయంలో నిరసనలు చేపట్టాం... అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాం... ఇంతలో పార్టీ ప్లీనరీ రావడంతో మాతో పాటు వారుకూడా ప్లీనరీ వచ్చారన్న జానారెడ్డి... ఈ వ్యవహారంలో ఇంకా ఏంచేయాల్సి ఉండేనో చెప్పండని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కేసును వాదించడానికి అభిషేక్ సింగ్విని హైకోర్టుకు పిలిచింది పార్టీయే అన్నారు జానారెడ్డి... ఆయనతో మాట్లాడింది తానేనని... ప్లీనరీ కంటే ముందే... రాహుల్ గాంధీకి కూడా చెప్పామన్నారు. లా కమిటీలో సభ్యుడితో కూడా మాట్లాడి... సలహాలు తీసుకున్నామన్న సీఎల్పీ నేత... అభిషేక్ సింగ్వి తో మాట్లాడిన అంశాన్ని సంపత్, కోమటిరెడ్డికి కూడా వివరించామన్నారు.