చంద్రబాబు హీరో ఆఫ్ ది నేషన్

చంద్రబాబు హీరో ఆఫ్ ది నేషన్

విభజన హామీల అమలు కోసం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. బీజేపీ రెబెల్ నేత శతృఘ్న సిన్హా  కూడా బాబుకి సంఘీభావం తెలియజేశారు. చంద్రబాబు హీరో ఆఫ్ ది నేషన్ అని ఆయన అభినందించారు. బాబు నియమాలకు కట్టుబడే మనిషని కొనియాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై బాబు గళమెత్తారన్నారు. ఏపీ ప్రజలకు తాను అండగా ఉంటామని షాట్ గన్ గా పిలుచుకొనే శతృఘ్నసిన్హా  చెప్పారు. 

సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ భవన్‌లో చేపట్టిన 12 గంటల దీక్షకు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాతో కలిసివచ్చి ఆయన మద్దతు ప్రకటించారు. వ్యక్తి కంటే  పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పదనే విషయం మోడీ తెలుసుకోవాలన్నారు. తానింకా బీజేపీలోనే ఉన్నానని, ఇంకా పార్టీ ఎంపీనేనని సిన్హా అన్నారు.చౌకీదార్‌ ఏం చేస్తున్నారో దేశ ప్రజలు తెలుసని సిన్హా వ్యాఖ్యానించారు.

బాబు పట్ల మోడీ  ఉపయోగించిన భాష సరైంది కాదన్నారు. ఈ భాష ప్రధాని స్థాయికి తగదన్నారు. మోడీ వ్యాఖ్యలకు చంద్రబాబు ధీటుగా జవాబిచ్చారని సిన్హా  చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది దేశానికి సంబంధించిన అంశమని.. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కూడ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను  అమలు చేయలేని నరేంద్ర మోడీకి ప్రధాని పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు.