ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: కేసీఆర్

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: కేసీఆర్

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం విధి విధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా  గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ట్రానికున్న నీటి వాటాను వినియోగించుకునే వ్యూహం అమలు చేయాలన్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ  సందర్భంగా సీఎం మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, సాగునీళ్లు అందిస్తారనే విశ్వాసంతో ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇచ్చారన్నారు. ప్రజల నమ్మకాన్ని  నిలబెట్టుకుంటామని, ఈ టర్మ్ లో అన్ని ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి  చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు సాగునీరు ఇవ్వడంతో పాటు పరిశ్రమలకు, మంచినీటికి కూడా ఎంత నీరు అవసరమవుతుందో లెక్కకట్టి, ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు వాడాలో  నిర్ణయించాలన్నారు. ప్రాజెక్టుల నుంచి వచ్చే నీటితో మొదట చెరువులు నింపడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

ప్రతీ ప్రాజెక్టులలో ఎక్కడ ఏ లోపం ఉందో చర్చించి, అక్కడికక్కడే లోపాన్ని సవరించాలని అధికారులకు సూచనలు చేశారు. పనుల్లో జాప్యం జరుగుతున్న చోట, జాప్యానికి కారణాలు తెలుసుకుని  పరిష్కార మార్గాలు చూపారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే వర్క్ ఏజన్సీలను మార్చాలని ఆదేశించారు. తెలంగాణలో ఓ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి అని ప్రధాని మోడీకి అనేక సార్లు  చెప్పాను. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 20-30 వేల కోట్లిచ్చి సాయపడండి అని వేడుకున్నా. అయినా సరే నరేంద్ర మోడీ డబ్బులు ఇవ్వలేదు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు  పునరుద్ధరిస్తున్న తీరును చూసి దేశమంతా మెచ్చుకున్నది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు రూ.24వేల కోట్లివ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయినా సరే, నరేంద్ర  మోడీ ప్రభుత్వం 24 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఈ సారి కేంద్రంలో మనది క్రియాశీల పాత్ర ఉంటుంది. కావాల్సిన నిధులు రాబట్టుకునే అవకాశం ఉంటుందన్నారు.

గోదావరి నదిలో తెలంగాణకు 950 టిఎంసిల నీటి వాటా ఉంది. సమైక్య రాష్ట్రంలోనే ఇది ఖరారైంది. దీని ప్రకారమే మనం గోదావరిపై కాళేశ్వరం, తుపాకుల గూడెం, సీతారామ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించాలి. హైదరాబాద్ కు తాగునీరు అందించాలి. ఇదే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. ఈ ఏడాది ఎండాకాలంలోనే పనులన్నీ పూర్తి చేసి, వర్షాకాలంలోఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు చెరువుల ద్వారా పొలాలకు చేరాలి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల  బ్యారేజిలు, కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపుహౌజుల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులను నింపి వ్యవసాయానికి నీరు, తాగు నీరు అందిస్తామని హామీ  ఇచ్చారు.