21 నుంచి కేసీఆర్ సహస్ర చండీయాగం

21 నుంచి కేసీఆర్ సహస్ర చండీయాగం

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనెల 21 నుంచి 25వరకు మహారుద్ర సహిత చండీయాగం నిర్వహించనున్నారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్ధ స్వామి ఈ క్రతువులను జరపబోతున్నారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన విశాఖ స్వరూపానందేంద్ర స్వామి సూచనల మేరకు రాజశ్యామల యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి, రెండో సారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 21 నుంచీ జరిగే యాగంలో 200 మంది రుత్వికులు పాల్గొంటారు. సందర్శకులు, భక్తుల్ని కూడా అనుమతిస్తారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ యాగం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ ఉద్యమంతో పాటు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా యాగాలు నిర్వహించారు కేసీఆర్. 2015 డిసెంబరులో ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో అయుత చండీయాగం నిర్వహించారు. వందలాది మంది రుత్విక్కులతో రెండు రోజుల పాటు యాగం జరిగింది. దేశం నలుమూలల నుంచి ప్రముఖులు తరలివచ్చి యాగంలో పాలుపంచుకున్నారు.