తెలంగాణకు వ్యతిరేకంగా 186 కేసులు

తెలంగాణకు వ్యతిరేకంగా 186 కేసులు

తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు, వరప్రదాయినిగా చేసే కాళశ్వరం వంటి కలల ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు 186 కేసులు పెట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీజేపీ... రాష్ర్ట, జిల్లా నాయకులు టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికల సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో కోటి ఏకరాలకు నీళ్లు రావాలని ముఖ్యమంత్రి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తుంటే కాంగ్రెస్ నేతలు అడ్డు పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రగతిని ఆపుతున్న ప్రతిపక్షాలు కావాలో, అన్ని విధాలుగా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్న కేసీఆర్ నాయకత్వం కావాలో ప్రజలే తేలుస్తారని కేటీఆర్ అన్నారు. 

తెలంగాణ అభివృద్ధి ప్రయాణాన్ని, పథాన్ని ఆపుతున్నందుకే ప్రజల తీర్పు కోరుతున్నామని, ఇందుకోసం తమకున్న అధికారాన్ని సైతం వదులుకొని ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు. వ్యవసాయాభివృద్ది కార్యక్రమాలు, రైతుబంధు పనులతో ముఖ్యమంత్రి ఒకవైపు ఉన్నారని, బషీర్ బాగ్, ముదిగొండ కాల్పుల్లో రైతులను చంపిన రాబందులు మరో దిక్కున ఉన్నారన్నారు. కరెంటు కోతల కాంగ్రెస్ ఒకవైపు, 24 గంటల టిఆర్ఎస్ మరొక వైపు ఉందన్నారు. తరుముకొస్తున్న ఎన్నికలను చూసి కచ్చితంగా ఓడిపోతామని కాంగ్రెస్ భయపడుతోందన్నారు. గతపాలనలో ప్రజలను దోచుకున్న తోడుదొంగలు ఒక్కటవుతున్నారన్నారు. 

నీళ్ళు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఎలాంటి సమస్యలు లేకపోవడంతో చివరకు నా కుటుంబాన్ని విమర్శించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందన్నారు. గత ఎన్నికల్లో సొంత కారులోనే రెండున్నర కోట్లు తగలబెట్టిన చరిత్ర కాంగ్రెస్ నేతలదని, ఇప్పుడు ఆయన నీతులు చెబుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పై విరుచుపడ్డారు. సంగారెడ్డిలో నీచమైన పనులు చేసి... భార్యా, పిల్లల పేర్లతో వేరే వాళ్లను విదేశాలకు అక్రమ రవాణా చేసినవారిని సైతం సమర్థిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీదన్నారు.