జేడీఎస్ తో పొత్తుకు మేం రెడీ...

జేడీఎస్ తో పొత్తుకు మేం రెడీ...

కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీ కాబోతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. కన్నడనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణ క్షణానికి మారుతూ మరింత ఉత్కంఠకు దారితీస్తున్నాయి. భాజపా 14 స్థానాల్లో విజయం సాధించి.. 96 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా... కాంగ్రెస్ 75 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించనున్న భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు తపిస్తుంది. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ... మూడో స్థానంలో ఉన్న జేడీఎస్‌తో పొత్తు పెట్టుకొనేందుకు సిద్ధమౌతోంది. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే.. మాట్లాడుతూ.. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకొనేందుకు తాము సిద్ధమౌతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన అన్ని అవకాశాలు పరిశీలిస్తామని ఖర్గే పేర్కొన్నారు. ఈ విషయంపై గులాం నబీ ఆజాద్‌, గెహ్లాట్‌లతో మాట్లాడతానని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భాజపా మ్యాజిక్‌ నంబరు కంటే తక్కువ వస్తే.. కాంగ్రెస్‌, జేడీఎస్ పొత్తు అంశానికి ప్రాధాన్యత ఏర్పడే అవకాశం ఉంది.