ఏపీ కొత్త డీజీపీపై ఉత్కంఠ‌

ఏపీ కొత్త డీజీపీపై ఉత్కంఠ‌

ఏపీ కొత్త పోలీసు బాస్ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల‌ఖ‌రున ఏపీ డీజీపీ మాల కొండ‌య్య ప‌ద‌వీ విర‌మ‌ణ చేయబోతున్నారు. డిశంబ‌ర్ లో ఆయన నాట‌కీయ ప‌రిణామాల మధ్య డీజీపీగా నియ‌మితులు అయ్యారు. కేవ‌లం ఆరు నెల‌ల స‌ర్వీసు మాత్రమే ఉన్న మాల కొండ‌య్య ఈ నెలాఖ‌రున రిటైర్ అవుతున్నారు. దీంతో ఇప్పుడు కొత్త డీజీపీ అంశంపై మ‌ళ్లీ ప్రభుత్వ వ‌ర్గాల్లో, పోలీసు శాఖ‌లో చ‌ర్చ మొద‌లైంది. సీనియారిటీ ప‌రంగా చూస్తే ఆర్పి టాకూర్, గౌతం స‌వాంగ్, విన‌య్ రంజ‌న్ రే, కౌముది, ర‌మ‌ణ మూర్తి, అనురాధ ముందు వ‌రుస‌లో ఉన్నారు. వీరిలో ర‌మ‌ణ మూర్తి ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లో రిటైర్ అవుతున్నారు. 1986 బ్యాచ్ కు చెందిన ఆర్పీ ఠాకూర్, గౌతం స‌వాంగ్ ల మ‌ద్యనే ప్రధాన పోటీ ఉంది. ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ కి మూడేళ్ల ప‌ద‌వీ కాలం ఉంది. కొత్త డీజీపీ రేసులో వీరిద్దరే ముందు వ‌రుసలో ఉన్నారు.

సాంబ‌శివ‌రావు అనంత‌రం ఠాకూర్ డిజిపి పోస్ట్ కోసం గ‌ట్టి ప్రయ‌త్నాలే చేశారు. పాత విధానం ప్రకారం అయితే మూడేళ్ల స‌ర్వీస్ ఉన్న ఠాకూర్ కు ఎక్కువ అవ‌కాశం ఉండేది. కానీ కేంద్రంతో ఈ విష‌యంలో వేగ‌లేని రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా డీజీపీని నియ‌మించుకునే విధంగా చ‌ట్టం చేసుకుంది. దీంతో త‌న‌కు న‌చ్చిన వారికే ప‌ద‌వి క‌ట్టబెట్టే సౌల‌భ్యం రాష్ట్ర ప్రబుత్వానికి ద‌క్కింది. ఈ ప‌రిణామాల‌తో కొత్త డీజీపీగా త‌మ పేర్లు ప‌రిశీలించాల‌ని ఠాకూర్, స‌వాంగ్ లు సిఎంను కోరుతున్నారు. ఠాకూర్ క‌డ‌ప జిల్లా ఎస్పీగా, అనంత‌పురం డీఐజీగా, రాయ‌ల‌సీమ ఐజీగా ప‌ని చేశారు. గౌతం స‌వాంగ్ చిత్తూరు ఎస్ పిగా, హైద‌రాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా, వ‌రంగ‌ల్ ఎస్పీగా ప‌ని చేశారు. చంద్రబాబుకు స‌వాంగ్ గ‌తంలో ద‌గ్గర‌గా వ్యవ‌హ‌రించారు అనే అభిప్రాయం ఉంది. దీంతో గ‌త ప‌రిచ‌యంతో సిఎం స‌వాంగ్ కు అవకాశం ఇస్తార‌ని ప్రచారం జ‌రుగుతుంది. మ‌రోవైపు స‌వాంగ్ కూడా త‌నకు తెలిసిన విధానంలో సిఎం వ‌ద్దకు త‌న పేరు పంపారు. స‌వాంగ్ ట్రాక్ రికార్డ్, సిఎంతో ఉన్న గ‌త ప‌రిచ‌యం కార‌ణంగా ఆయ‌నకు అవ‌కాశం ఉంటుంద‌నే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇదే స‌మ‌యంలో మంచి ప‌బ్లిక్ రిలేష‌న్ క‌లిగిన ఆర్పి ఠాకూర్ కూడా గ‌ట్టిగానేప్రయ‌త్నాలు చేస్తున్నారు. డిల్లీ స్థాయిలో గ‌ట్టి ప‌రిచ‌యాలు ఉన్న ఠాకూర్ ఆ దిశంగా కూడా ప్రయ‌త్నాలు చేస్తున్నారు. అయితే ఎసిబి డిజిగా ఠాకూర్ మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచార‌నే అభిప్రాయం కూడా ఉంది. మూడేళ్ళ ప‌ద‌వీ కాలం ఉన్న ఠాకూర్ కు అవ‌కాశం ఇస్తారా.. ఐదేళ్లు ప‌ద‌వీ కాలం ఉన్న స‌వాంగ్ కు ఇస్తారా అనే విష‌యంలో ఎటూ తేల‌డం లేదు.

రానున్న ఎన్నిక‌లను కూడా దృష్టిలో పెట్టుకుని డీజీపీ నియామ‌కం ఉంటుంది. ఏడాది లోపుగానే ఎన్నిక‌లు ఉండ‌డంతో డీపీసీ పోస్ట్ లో తమ‌కు అనువైన అధికారి ఉండాల‌ని ప్రభుత్వం భావిస్తుంది. ప‌ద‌వీ కాలం చేప‌ట్టిన త‌రువాత గ‌తంలో మాదిరిగా క‌నీసం రెండేళ్ల పాటు ప‌ద‌విలో ఉండాల‌నే నిబంధ‌న కూడా ఇప్పుడు లేదు. దీంతో కొత్త డీజీపీని నియ‌మించుకున్న త‌రువాత వారు ఎంత‌కాలం ప‌ద‌విలో ఉండాలి అనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారప‌డి ఉంటుంది. ప‌ద‌వి విర‌మ‌ణ స‌మ‌యానికి ముందే వారిని బ‌దిలీ చేసి కొత్త వారికి అవ‌కాశం ఇవ్వవ‌చ్చు. డీజీపీ నియామ‌కం పూర్తి రాజ‌కీయ నియామ‌కంగా మారిన ప్రస్తుత ప‌రిస్థితుల్లో సీఎం ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారు అనే విష‌యంలో విస్తృత చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ కీల‌క నిర్ణయంపైనా చివ‌రి నిముషం వ‌ర‌కు ఏమీ తేల్చని సీఎం.. ఈసారి కూడా అదే విధానం అనుసరిస్తారా.. లేక డీజీపీ స్థాయి పోస్ట్ కాబ‌ట్టి ముందే హింట్ ఇస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రచారం ప్రకారం స‌వాంగ్ కు డీజీపీ పోస్ట్ ఇచ్చేందుకు ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌నే ప్రచారం సాగుతోంది.