ఇద్దరు క్రికెట్‌ బుకీలు అరెస్టు

ఇద్దరు క్రికెట్‌ బుకీలు అరెస్టు

క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను అరెస్టు చేసి వారి నుంచి రూ. 3.83 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కొంపల్లికి చెందిన ఎలక్ర్టీషియన్‌ అజీజ్‌ అలీ లలాని (48) తరచూ క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3న న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌కు సంబంధించి బెట్టింగ్‌ డబ్బు కోసం మంగళవారం రాత్రి చిరాగ్‌ అలీలేన్‌లోని గ్రీన్‌బావర్చి హోటల్‌ వద్ద ఉన్నాడు.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని లలానిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ. 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. లలానిని విచారించగా.. సికింద్రాబాద్‌లో ఉంటున్న రోమిత్‌ ఉమాని (25) వద్ద తాను సబ్‌ బుకీగా పనిచేస్తున్నట్లు తెలిపాడు. పోలీసులు ఉమానిని కూడా అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ.1.83 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధాన బుకీ హఫీజ్‌ పరారీలో ఉన్నాడు.