తిత్లీ తుఫాన్: స్తంభించిన రాకపోకలు

తిత్లీ తుఫాన్: స్తంభించిన రాకపోకలు

తిత్లీ అతి తీవ్ర తుఫాన్ గా మారింది. ఉదయం తీరం దాటి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 140 నుంచి 150 వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తిత్లీ తుఫాన్ దెబ్బకు 8మంది బలయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భీకరంగా తిత్లీ తుఫాన్ కొనసాగుతుంది. వేగంగా వీస్తున్న గాలుల ధాటికి 2వేల కరెంట్ స్థంభాలు నేలకూలాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. చెట్లు కూలి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 6 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
 
తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలోని చాలా చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను నేపథ్యంలో కళింగపట్నంలో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన పోర్టులలో ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా హుద్‌హుద్‌ వణికించగా.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని పలాస వద్ద తిత్లీ విజృంభిస్తోంది. ఉత్తరాంధ్రపై తిత్లీ ప్రభావం రేపటి వరకు కొనసాగే అవకాం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.