దళిత యువకుడిని రాళ్లతో కొట్టి చంపారు

దళిత యువకుడిని రాళ్లతో కొట్టి చంపారు

అల్లరిమూకకు అడ్డువెళ్లాడు. ఓ అమ్మాయికి రక్షణ నిలిచాడు. అదే అతని పాపమైంది. ఆ రాక్షస గుంపు చేసిన రాళ్లదాడిలో ఆ దళిత యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఓ అమ్మాయిని ఏడిపిస్తుంటే అడ్డుపడిన రోహిత్ తొడివాన్ అనే దళిత యువకుడిని అగ్రవర్ణాలకు చెందిన అబ్బాయిలు రాళ్లతో కొట్టి చంపేశారు. గంగాపూర్ ప్రాంతంలోని ఉల్లేద్ పూర్ గ్రామంలో బుధవారం కావడీ యాత్ర జరిగింది. ఈ సందర్భంగా స్థానిక యువకుల మధ్య గొడవ జరిగింది. గ్రామపెద్దలు వివాదం పరిష్కరించారు. గురువారం కొన్ని దళిత కుటుంబాలు అగ్రవర్ణాల వారితో గొడవ పడ్డాయి. మాటామాటా పెరిగి వాగ్వాదం చెలరేగింది. చివరికి అది రాళ్లు రువ్వుకొనే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన రోహిత్ చికిత్స పొందుతూ చనిపోయాడు. 12 మంది అగ్రవర్ణాల యువకులు తమ అబ్బాయిని చుట్టుముట్టి లాఠీలు, ఇనుపకడ్డీలతో దాడి చేశారని రోహిత్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇరువర్గాలకు చెందిన 12 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అగ్రకుల యువకులు 10 మందిపై ఐపీసీ సెక్షన్ 302,323,506 కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. వీళ్లలో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, మిగతా వారికోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.