ధావన్‌ మెరుపు సెంచరీ

ధావన్‌ మెరుపు సెంచరీ

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ చేసాడు. టీ-20, వన్డే తరహాలో ఆడుతూ ధావన్‌(104; 91బంతుల్లో 19x4, 3x6) శతకం సాధించాడు. ఐపీఎల్-11లోని ఫామ్ ను కొనసాగిస్తూ.. భారత ఇన్నింగ్స్ మొదటి నుంచే దూకుడుగా  ఆడుతూ బౌండరీలు బాదాడు. వీలు చికున్నపుడల్లా బంతిని స్టాండ్స్ లోకి పంపుతూ జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ సంచలన స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ వేసిన 26ఓవర్‌లో బౌండరీ కొట్టి శతకం చేసాడు. దీంతో టెస్టుల్లో ఏడో శతకాన్ని నమోదు చేశాడు. మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌(41; 72బంతుల్లో 6x4, 1x6) ధావన్ కు చక్కటి సహకారం అందిస్తున్నాడు. విజయ్ కూడా అర్ధశతకంకు చేరువలో ఉన్నాడు. భారత ఓపెనర్ల దెబ్బకు ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రషీద్‌ ఖాన్‌ 7 ఓవర్లలో 7.29 రన్ రేట్ తో 51 పరుగులు ఇచ్చాడు. లంచ్‌ విరామానికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 27 ఓవర్లుకు 158 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో మురళీ విజయ్(41), శిఖర్ ధావన్(104) పరుగులతో ఉన్నారు.