ఆర్టీసీ సమస్యలపై సీఎంకు నివేదిక...

ఆర్టీసీ సమస్యలపై సీఎంకు నివేదిక...

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన సమస్యలపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ కు నివేదిక అందజేస్తుందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఇంతకుముందే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నేతృత్వంలోని ఉపసంఘం నిన్న సచివాలయంలో ఆర్థిక, రవాణాశాఖ అధికారులు, టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ సంఘ్ నేతలతో సమావేశమై అన్ని విషయాలపై చర్చించింది. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని మంత్రులు పేర్కొన్నారు.

సమావేశం అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై కూలంకషంగా చర్చించి నివేదికను సమర్పించామని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కూడా నివేదిక అందజేస్తామన్నారు. ఆర్సీ, ఇతర సమస్యలపై కూడా కేసీఆర్ కు రిపోర్ట్ అందచేస్తాం అని అన్నారు. 16వ తేదీన సీఎం సమక్షంలో జరిగే  సమావేశంలో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి.. ఒకరోజు ముందుగా సీఎంకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. 55 వేల మంది కార్మికులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు అని గుర్తుచేశారు. లక్షలాది మంది పేద విద్యార్థులకు బస్ పాసులు ఇస్తున్నారు అని పేర్కొన్నారు. ఎంతోమంది పేదలకు ఆర్టీసీ  ఉపయోగపడుతుందన్నారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.