అంతా మోడీ డైరెక్షన్‌లోనే... రేవంత్‌

అంతా మోడీ డైరెక్షన్‌లోనే... రేవంత్‌

'ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డైరెక్షన్‌లోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారు. మోడీ.. కేడీ కలిసి ఆడుతున్న నాటకమే నిన్నటి రివ్యూ' అని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోడీ సూచించడంతోనే ఓటుకు నోటు కేసును తిరగదోడుతున్నారని అన్నారు.  ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్‌.. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం.. మోడీకి ఇబ్బందికరంగా మారిందని, అందుకే ఓటుకు నోటు కేసును మళ్లీ ప్రస్తావిస్తున్నారని అన్నారు. చంద్రబాబు తిరుపతి సభ తరవాత మోడీ, అమిత్‌లు ఆదేశాలు ఇచ్చారన్నారు. తాను ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై బయటకు వచ్చినందున ఆ కేసు గురించి లోతుగా ప్రస్తావించడంలేదని రేవంత్‌ చెప్పారు. తెలంగాణలో బస్సు యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు చేసినందున తనపై కక్షసాధింపునకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని రేవంత్‌ అన్నారు. పలు సీబీఐ కేసుల్లో కేసీఆర్‌ ఇరుక్కున్నారని, అందుకే మోడీ చెప్పినట్లు చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని రేవంత్‌ ఆరోపించారు. కేంద్రంలో తొలుత సీబీఐ, ఈడీలను పంపి.... తరవాత మోడీ, అమిత్‌ షాలు రంగంలోకి దిగుతారని, అలాగే రాష్ట్రంలో తొలుత ఏసీబీని ఉసిగొలిపి తరవాత కేసీఆర్‌ రంగంలోకి దిగుతారని ఆయన ఆరోపించారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని రేవంత్‌ అన్నారు.

రాష్ట్రాన్ని దోచేస్తున్నారు..
గులాబీ కూలీ పేరుతో తెలంగాణను దొచుకుంటున్నారని రేవంత్‌ విమర్శించారు. 'గులాబీ కూలి'పై కోర్టులో కేసు వేస్తే.. ఏసీబీకి ఆదేశాలు అందాయని, అయినా ఆ కేసును ఎందుకు పక్కన పెట్టేశారని ప్రశ్నించారు. 'గొంతు'ను ఆధారంగా చేసుకుని చంద్రబాబును దోషి అని అంటున్న కేసీఆర్‌.. ఇదే తరహాలో వేమలు వీరేశం మాట్లాడిన ఫోన్‌ సంభాషణల ఆధారాలు ఇచ్చినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు గొంతు అవునాకాదా అని ఫోరెన్సిక్‌కి పంపిన కేసీఆర్‌.. వీరేశం గొంతును ఎందుకు పంపించలేదని నిలదీశారు. లంచాలు తీసుకోండని బహిరంగంగా చెప్పిన సిరిసిల్ మునిసిపల్‌ చైర్మన్‌పై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ చరిత్ర అందరికీ తెలుసుని, ఆయన ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని రేవంత్‌ చెప్పారు.