టీఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి

టీఆర్ఎస్ లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి

మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎంపీలు కేశవరావు, కవిత, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ బండారి లకా్ష్మరెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, ముఖ్యనేతలకు పార్టీ కండువా కప్పి టీఆర్‌ఎస్ లోకి ఆహ్వానించారు. 

అనంతరం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ, 1989 నుంచి కేసీఆర్ తో ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలనే నేను టీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు. అభివృద్ధి కోసం పరుగెడుతున్న గుర్రం టీఆర్ఎస్ పార్టీ అని.. అందుకే పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. కొన్ని కూటములు కేవలం అవకాశ వాదంతోనే ఏర్పడుతున్నాయని, వాటిని తెలంగాణ ప్రజలు ఆమోదించరని సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతి పక్షాలు కుస్తీ పోటీల్లో పాల్గొన్నట్టుగా ప్రతి రోజూ తిట్లే పరమావధిగా పని చేస్తున్నాయని, కేసీఆర్ అనుభవంతోనే తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తుందని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి స్పష్టం చేశారు.