నాగవైష్ణవి హత్య కేసు నిందితులకు జీవితఖైదు

నాగవైష్ణవి హత్య కేసు నిందితులకు జీవితఖైదు

ఎనిమిదిన్నరేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన చిన్నారి పలగాని నాగవైష్ణవి అపహరణ, హత్య కేసులో విజయవాడలోని మహిళా సెషన్స్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. హత్య, అపహరణ నేరాలు రుజువు కావడంతో ముగ్గురు నిందితులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌, వెంకటరావుగౌడ్‌లకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై నిందితులు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇచ్చారు. కోర్టు తీర్పుపై నాగవైష్ణవి బంధువులు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తీర్పును ఎనిమిదిన్నర ఏళ్లు పట్టడంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అసలేం జరిగింది?

విజయవాడకు చెందిన పలగాని ప్రభాకరరావు వ్యాపారి. బీసీ నాయకుడు. నలుగురు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లున్న ఉమ్మడి కుటుంబం. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో సోదరి వెంకటేశ్వరమ్మ కొడుకు, కూతురితో పుట్టింటికి చేరింది. ఆమె కుమార్తెను ప్రభాకరరావు వివాహం చేసుకున్నాడు. వారికి ఆరుగురు మగపిల్లలు అంగవైకల్యంతో పుట్టి చనిపోయారు. 

పిల్లలంటే ఎంతో ఇష్టపడే ప్రభాకరరావుకు సమీప బంధువైన నిజామాబాద్‌కు చెందిన నర్మదాదేవితో పెళ్లి జరిపించారు. వారికి ఇద్దరు మగపిల్లలు, ఒక పాప కలిగారు. ఒక్కగానొక్క కుమార్తె నాగవైష్ణవి అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. ప్రభాకరరావు రెండో భార్య ఇంటిలో ఎక్కువ సమయం గడుపుతుండటంతో మొదటి భార్య, ఆమె సోదరుడు పంది వెంకట్రావు తరచూ ఆయనతో వాదనకు దిగేవారు. 

గొంతు నులిమి చంపేసి.. బూడిద చేశారు

ఈ క్రమంలోనే 2010 జనవరి 30న నాగవైష్ణవి తన సోదరుడితో కలిసి కారులో పాఠశాలకు వెళ్తుండగా దుండగులు అడ్డగించి అపహరించారు. ప్రతిఘటించిన కారు డ్రైవరు లక్ష్మణరావును గొంతులో కత్తితో  పొడిచి చంపారు. నాగవైష్ణవి సోదరుడు తప్పించుకుని పారిపోయాడు. అదేరోజు నాగవైష్ణవిని కారులో విజయవాడ నుంచి గుంటూరు తీసుకెళ్తూ గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహం ఆనవాళ్లు దొరకకుండా చేసేందుకు గుంటూరు ఆటోనగర్‌లోని ఓ బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో పడేసి ఎముకలు కూడా కరిగిపోయేలా బూడిద చేశారు. 

బ్లాస్ట్ ‌ఫర్నేస్‌ నుంచి నాగవైష్ణవి చెవిపోగులను సేకరించిన పోలీసులు వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపారు. చెవిపోగుకు వజ్రం ఉండడంతో అదే ఈ హత్య కేసులో కీలక సాక్ష్యంగా మారింది. కారు డ్రైవరు హత్య సమయంలో ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ 79 మంది సాక్షులను, డిఫెన్స్‌ 30 మంది సాక్షులను ప్రశ్నించింది.

 అపహరించిన తన చిన్నారిని అత్యంత దుర్మార్గంగా హతమార్చారనే సంగతి తెలియడంతో పాప తండ్రి పలగాని ప్రభాకర్‌ గుండెపోటుతో మరణించారు.

న్యాయం కోసం పోరాడుతూ అనంత లోకాలకు..

ఈ కేసులో కుట్రదారుడైన పలగాని ప్రభాకరరావు బావమరిది పంది వెంకట్రావు గౌడ్‌, పాత్రధారులైన మోర్ల శ్రీనివాసరావు, యంపరాలు జగదీశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఏ-1గా శ్రీనివాసరావు, ఏ-2గా జగదీశ్‌, ఏ-3గా వెంకటరావు గౌడ్‌ను చార్జిషీట్‌లో చేర్చారు. కన్నబిడ్డను, కట్టుకున్న భర్తను కళ్ళ ముందే కోల్పోయిన నాగవైష్ణవి తల్లి నర్మదాదేవి తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు.ఈ కేసు విచారణ త్వరగా పూర్తిచేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ప్రభాకర్‌ సోదరుడు సుధాకర్‌తో కలిసి న్యాయపోరాటం చేశారు. మానసిక కుంగుబాటు, బ్రెయిన్ క్యాన్సర్ తో గతేడాది ఆమె మరణించారు. నాగవైష్ణవి బాబాయి సుధాకర్‌ కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. నాగవైష్ణవి తల్లి నర్మదాదేవి బతికుండగా తీర్పు వస్తే బాగుండేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.