రాష్ట్ర ప్రభుత్వ విధానాలతోనే ఏపీకి నష్టం

రాష్ట్ర ప్రభుత్వ విధానాలతోనే ఏపీకి నష్టం

రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని ఏపీ బీజేపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో నిర్వహించిన 15వ ఆర్థికసంఘం సమావేశంలో పాల్గొన్న బీజేపీ ప్రతినిదులు రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. కేంద్రం తగినంత నిధులు ఇచ్చినా.. రాష్ట్రం విద్యా, వైద్య రంగాలను విస్మరించిందని ఆరోపించారు. ప్రాధాన్యత రంగాల వారీగా ఖర్చు చేయడంలో ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల  కేంద్ర నిధులు రాకుండా పోయాయని విమర్శించారు. నిధుల కేటాయింపునకు 2011 జనాభా ప్రాతిపదిక బాగానే ఉన్నా జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోతాయని తెలిపారు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల అభివృద్ధి హైదరాబాద్ కే పరమితమైందని ఆరోపించారు.  ప్రస్తుత రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా రాష్ట్రానికి తగిన సూచనలు చేయాలని కోరారు. 

ఛైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు
గతంలో విభజన చట్టాల అమలుకు ప్రత్యేక వ్యవస్ధ ఉండేదనీ.. కానీ ఏపీ పునర్ విభజన చట్టం అమలుకు పర్యవేక్షన వ్యవస్ధే లేదని ఆర్దిక సంఘం ఛైర్మన్ ఎన్ కె సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం అమలుకు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ బాధ్యులుగా ఉండేవారని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం పార్లమెంటుకు వచ్చినప్పుడు రాజ్యసభలో ఉన్నానని తెలిపారు. ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ చప్పట్లు కూడా కొట్టారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అమలు విషయం ఎన్డీసీదే బాధ్యత అని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్దిక సంఘం పరిధిలోకి రాదని తెలిపారు. రెవెన్యూ లోటు భర్తీ విషయమై రాష్ట్ర ప్రతిపాదనలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. సమావేశానికి వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి, బీజేపీ తరఫున సుధీష్ రాంభోట్ల, సీపీఎం నుంచి మధు తదితరులు హాజరయ్యారు.