ఆర్బీఐని రూ.27,380 కోట్లు కోరిన ఆర్థిక శాఖ

ఆర్బీఐని రూ.27,380 కోట్లు కోరిన ఆర్థిక శాఖ

రూ.27,380 కోట్లు బదిలీ చేయాల్సిందిగా ఆర్బీఐని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. కొన్నేళ్లుగా ఈ మొత్తాన్ని ఆర్బీఐ తన దగ్గర రిస్క్ కవర్, రిజర్వ్ గా పెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ 2016-17లో రిస్క్ కవర్, రిజర్వ్ కింద రూ.13,190 కోట్లు ఉంచుకుంది. 2017-18లో రూ.14,190 కోట్లు తీసుకుంది. ఈ రకంగా ఆర్బీఐ తన దగ్గర మొత్తం రూ.27,380 కోట్లు జమ చేసింది. గత ఆర్థిక సంవత్సరం సారూప్యత అనుసరించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గత రెండేళ్లుగా జమ చేసిన మొత్తం నుంచి తాత్కాలిక మిగులుగా బదిలీ చేయాలని ఆర్థికశాఖ ఆర్బీఐని కోరింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ.28,000 కోట్ల తాత్కాలిక మిగులు రావచ్చని ఈ నెల ప్రారంభంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వానికి ఇప్పటికే రూ.40,000 కోట్లు వచ్చాయి. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ తాత్కాలిక మిగులు రూపేణా ప్రభుత్వానికి రూ.28,000 కోట్లు బదిలీ చేయాలన్న వినతిని అంగీకరిస్తే కేంద్ర బ్యాంక్ 2018-19లో ఇచ్చిన మొత్తం రూ.68,000 కోట్లకు చేరుతుంది. 

వచ్చే ఏడాది మిగులు రూపేణా రూ.69,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్బీఐ, ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.82,911.56 కోట్లు వస్తాయని సర్కార్ అంచనా వేస్తోంది.