విజయవాడలో భారీ అగ్నిప్రమాదం..

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం..

విజయవాడ, కానూరు రోడ్డులోని ఆటోనగర్ లో కొద్దిసేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదట అక్కడ ఓ కూలర్ల తయారీ కంపెనీలో నుంచి వ్యాపించిన మంటలు, పక్కనే ఉన్న ఇంజనాయిల్ మిక్సింగ్ సంస్థకు ఎగసిపడ్డాయి. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న చిన్నా, చితక కంపెనీల వరకు పాకి.. మరింత ఉద్ధృతం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది 4 ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

ఆ కంపెనీలలో తగలబడుతున్నది ప్లాస్టిక్, ఇంజనాయిల్ కావడంతో ఏ మాత్రం మంటలు అదుపుచేయలేకపోయారు. చుట్టుపక్కల పలు ఫ్యాక్టరీలు ఉండటంతో భారీ ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు వారిని హుటాహుటిన ఖాళీ చేయించారు. అక్కడే ఉన్న హ్యుందాయ్ కార్ల కంపెనీలోని కార్లనూ బయటకు తెప్పించారు. విజయవాడలో ఎక్కడి చూసినా మంటల కారణంగా గాల్లోకి పెద్ద ఎత్తున పొగ కమ్మేసింది. అలాగే.. మంటలు రోడ్డుపైకి రాకుండా.. కార్బన్ డై ఆక్సైడ్ పౌడర్ ను అధికారులు చల్లారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ... ఫైరింజన్లతో మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదని.. పూర్తిగా ఆహుతైన తర్వాతే అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు